30.9 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

ఏపీ రాజకీయాలను వేడెక్కించిన చిరు ఎంట్రీ ?

    ఏపీలో పోలింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నామినేషన్ల పర్వం కూడా పీక్ స్టేజ్‌కు చేరడంతో మండు వేసవిలో ఏపీ రాజకీయం సెగలు కక్కుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పొలిటికల్ తెరపైకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతేనా రాజకీయాలకు దూరం అంటూనే పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చేశారు. కూటమికి బూస్ట్ ఇచ్చేలా కీలక ప్రకటన చేశారు. ఇంతకీ చిరు ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..? చిరుపై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ ఏంటి..? రాజకీయాల్లోకి చిరు ఎంట్రీ ఇస్తారా..?

   ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి ఆయన మద్దతు పలికారు. భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీ, జనసేన ఒక కూటమిగా పోటీ చేయడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌కు చిరంజీవి మద్దతు పలికారు. అలాగే పెందుర్తి నుంచి జనసేన టికెట్‌పై బరిలో ఉన్న పంచకర్ల రమేష్ బాబుకు కూడా అండగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ఈ ఇద్దరినీ గెలిపించాలని చిరంజీవి కోరారు. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితోనే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సాధ్యమవుతుందని చిరంజీవి చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత తాను రాజకీయాల ప్రస్తావన తీసుకురావడానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కల్యాణేనని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి. చిరంజీవి చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వాస్తవానికి చిరంజీవికి రాజకీయాలకు కొత్తకాదు.

    తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్‌ ఒన్‌గా ఉన్న చిరంజీవిపై రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి చాలా కాలం నుంచి ఉంది. అయితే తాను అందరివాడినంటూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు మెగాస్టార్. అయితే ఒక దశలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయనకూడా భావించారు. అప్పటికే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రజారాజ్యం పార్టీ స్థాపన. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పేరుతో స్వంత పార్టీ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తృతంగా పర్యటించారు. 2009 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేసింది. లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అన్నిటిలో పరాజయం పాలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 18 సీట్లు గెలుచుకుంది ప్రజా రాజ్యం పార్టీ. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అనేక పరిణామాలు సంభవించాయి.ఈ నేపథ్యం లో 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. కాంగ్రెస్‌తోనే అభివృద్ది సాధ్యమవు తుందని తాను భావిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ఆకాంక్షించే తాను ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు వివరణ ఇచ్చారు చిరంజీవి.

  ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవిని అక్కున చేర్చుకుంది కాంగ్రెస్ హై కమాండ్. దీంతో 2012లో అప్పటి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా చేరారు చిరంజీవి. 2014 మే వరకు కేంద్ర మంత్రిగా చిరంజీవి కొనసాగారు. ఆ తరువాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ సభ్యత్వాన్ని ఆయన రద్దు చేసుకోలేదు. అంతేకాదు కాంగ్రెస్ నుంచి వైదొలగుతున్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నికల్‌గా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎన్డీయే కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతమంది వచ్చినా, ఎంతమంది కూటమి కింద జట్టు కట్టినా, జగన్మోహన్ రెడ్డి జైత్రయాత్రను అడ్డకోలేరన్నారు. ఎన్ని పార్టీలు జట్టు కట్టినా, సింహంలా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎదుర్కొంటారని సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు.

   ఆంధ్రప్రదేశ్‌ కు చిరంజీవి నాన్ రెసిడెంట్ అన్నారు కాంగ్రెస్ నేత హఫీజ్ ఖాన్. వాస్తవానికి చిరంజీవి నివాసం ఆంధ్రప్రదేశ్‌లో లేదన్నారు ఆయన. చిరంజీవి హైదరాబాద్‌లో నివాసం ఉండే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అభిమానులను అడ్డం పెట్టుకుని చిరంజీవి రాజకీయం చేస్తున్నారని హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఈ అభివృద్ధి సంగతి తెలియకనే ఎన్డీయే కూటమికి చిరంజీవి మద్దతు పలికారన్నారు హఫీజ్ ఖాన్. కొంత కాలంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ పొలిటికల్‌గా తన మద్దతు తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ఉన్నాయన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విరాళం కూడా ఇచ్చారు. దీంతో జనసేనకు అలాగే ఎన్డీయే కూటమికి చిరంజీవి పరోక్ష మద్దతు ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి.

   ఇదిలా ఉంటే ఇటీవల సోదరుడు నాగబాబును తీసుకుని వెళ్లి పెద్దన్న చిరంజీవిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. దీంతో ఎన్డీయే కూటమికి మద్దతు అంశానికి బలం చేకూరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చిరంజీవి వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేన అభ్యర్థులను పక్కన కూర్చోబెట్టుకుని వాళ్లను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి విజయంతోనే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సాధ్యమని చిరంజీవి దాదాపుగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్డీయే కూటమికి చిరం జీవి మద్దతు పలకడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు పలువురు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీల కంగా ఉన్నారు. జగన్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. దీంతో చిరంజీవిని ఒక సినిమా నటుడిగా తాము అభిమానిస్తాం కానీ, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికే తమ ఓటు అంటున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో చిరంజీవి ఎటు వైపు ఉంటారన్న దానిపై కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. ఎన్డీయే కూటమికి జై కొట్టారు చిరంజీవి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్