స్వతంత్ర వెబ్ డెస్క్: బస్ కండెక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాకి చెందిన మురిగెప్ప అథాని కేఎస్‌ఆర్‌టీసీ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్జల్‌పూర్ నుంచి విజయపురకు బయల్దేరిన బస్ హెడ్ లైట్ సమస్యతో ఆగిపోయింది. దీంతో బస్‌లోని ప్రయాణికులను దించేసి.. బస్సును సిందగి డీపోకి తరలించేందుకు కండక్టర్, డ్రైవర్ బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ మురిగెప్ప అథానికి గుండెపోటు రావడంతో సీటులోనే కుప్పకూలిపోయారు. దీంతో బస్సు అదుపు తప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది.
బస్సు కండక్టర్ శరణు తకాలి కింద పడిన డ్రైవర్‌ను పక్కకు జరిపి, బ్రేక్ వేసి బస్సును ఆపేశాడు. కండక్టర్ సమయ స్పూర్తితో వ్యవహరించడం మూలంగా పెను ప్రమాదం తప్పినట్లైంది. అదే సమయానికి బస్సులో ప్రయాణికులు లేకపోవడం కలిసివచ్చింది. లేదంటే ఊహకందని ప్రమాదం జరిగేది. సమాచారం అందుకున్న అప్జల్‌పూర్ డిపో సిబ్బంది బస్సు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన సిందగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.