ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రేపటి వరకు వాయుగుండంగా బలపడనుంది. ఈనెల 23 నాటికి తుపానుగా మారి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు దానా అని నామకరణం చేశారు.
దూసుకొస్తున్న దానా తుపానుతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 25న కోస్తాంధ్ర, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈనెల 20, 24 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. ఈనెల 24 నాటికి ఒడిశా- బెంగాల్ పరిసరాల్లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఈనెల 23, 24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈనెల 25 వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.