లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. తుక్కుగూడలోనే నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. తరువాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో అదే సెంటిమెంట్‌తో పార్లమెంట్ ఎన్నికలకూ ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు.
జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతోపాటు మంత్రులపైనా టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని, మిగిలిన నియోజకవర్గాల్లో బూత్‌కు ఒక వాహనం బయలు దేరాలని, ఒక్కో వాహనంలో పది మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సీఎం సూచన మేరకు పార్టీ అభ్యర్థులు, మంత్రు లు జన సమీకరణకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల కుగాను ప్రభుత్వం ఇప్పటికి అమలు చేసిన ఐదు గ్యారెంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో.. సభలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండేలా చూస్తున్నారు.
తుక్కుగూడ సభ వేదికగా తెలుగులో కాంగ్రెస్ మేనిఫెస్టోని రాహుల్‌గాంధీ విడుదల చేస్తారు. మేనిఫెస్టోతోపాటు ‘పాంచ్ న్యాయ్’ గ్యారెంటీల తెలుగు ప్రతులనూ విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ప్రకటించనున్నారు. పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్‌గాంధీ.. దేశ ప్రజలకు స్వయంగా హామీలు ఇస్తున్న సభ కావడంతో ఈ సభను సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నారు. జనజాతర సభ వేదికగా ప్రధాని మోదీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌లే టార్గెట్‌గా రాహుల్ ప్రసంగం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతు న్నాయి. మోదీ పదేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ చూపుతున్న పరిష్కార మార్గాలు, ఇస్తున్న హామీలను రాహుల్ వివరించనున్నట్లు చెబుతున్నాయి. రాష్ట్రంలో వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమా లను సీఎం రేవంత్‌రెడ్డి వివరించనున్నారు.