ఐపీఎల్ క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఈనెల 22న సీజన్ 17 ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ కొరకు చెన్నై ముస్తాబైంది. గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో తలపడనుంది. బీసీసీఐ ప్రకటించిన తొలి షెడ్యూల్ ప్రకారం ఈనెల 22 నుంచి ఏప్రిల్ 9 వరకు 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ అభిమానులకు ఇక పండగే పండుగ… సిక్సర్లు, ఫోర్ల మోతతో పాటు హోరాహోరీ పోటీలకు వేదికగా నిలిచే ఈ ఐపీఎల్ సీజన్ 17 గురించి ఓ లుక్కేద్దాం..
బీసీసీఐ ప్రకటించిన తొలి షెడ్యూల్ ప్రకారం 21 మ్యాచ్‌లు వివిధ రాష్ట్రాల్లో జరగనున్నాయి. ఈనెల 22 నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ పోటీలకు ఆయా రాష్ట్రాలు ఆతిధ్యం ఇవ్వనుండగా, 2024 ఐపీఎల్ టైటిల్ కొరకు పది జట్లు పోటీ పడుతున్నాయి, తొలి షెడ్యూల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్ లు ఆడనుంది. నాలుగింట్లో రెండు మ్యాచ్‌లు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈనెల 27న చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 5న ముంబాయి ఇండియన్స్ తో సన్‌రైజర్స్ తలపడనుంది.
అటు శుక్రవారం ప్రారంభం కానున్న తొలి మ్యాచ్ పోటీకై చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసాయి. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అభిమాన ఆటగాళ్ళ సమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఆయా జట్ల జెర్సీలతో ముస్తాబవుతున్నారు క్రికెట్ అభిమానులు.
ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ ఉండటంతో ఇందులో ప్రతిభ చాటిన ఆటగాళ్లకు వరల్డ్ కప్‌లో ఆడే ఛాన్స్ దక్కనుంది. అటు కోట్లు వెచ్చించి వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్టార్క్ ను కోల్‌కత్తా నైట్ రైడర్స్ లీగ్ చరిత్రలోనే 24.75 కోట్ల అత్యధిక ధర కు సొంతంచేసుకుంది. ఆస్ట్రేలియా సారథి కమిన్స్‌ను 20.50 కోట్లకు SRH సొంతం చేసుకుంది. జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది.
దశాబ్ద కాలంగా ముంబయి ఇండియన్స్‌ను కెప్టెన్సీ హోదాలో నడిపించిన రోహిత్ శర్మ ఈ ఐపీఎల్‌లో ప్లేయర్‌గా తన సత్తా చాటనున్నాడు. రోహిత్ స్ధానంలో హార్దిక్ పాండ్య ఈసారి ముంబయికి కెప్టెన్సీగా వ్యవహరిస్తున్నాడు. ఇది పాండ్యకు ఒక సవాలే. కాగా రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బైటపడి శస్త్రచికిత్సలు చేయించుకున్న రిషబ్ పంత్ ఫిట్నెస్ సాధించాడు. అతని సారథ్యంలోనే డిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతోంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో కొత్త టెక్నాలజీని బీసీసీఐ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న విమర్శలకు చెక్ చెప్పేలా స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే దీని అమలుపై బీసీసీఐ అదికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.