స్వతంత్ర, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబాన్ని చూసి భక్తులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కుటుంబమంతా బంగారంతో చేసిన భారీ ఆభరణాలు ధరించారు. ఆ బంగారు ఆభరణాలపై వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ప్రతిమలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లంకు చెందిన సుభాష్ చంద్ర కుటుంబసభ్యులు గోవిందుడిని తమ ఇంటి ఇలవేల్పుగా చూసుకుంటారట.
పూర్వీకుల కాలం నుంచి శ్రీవారిని ఇంటి దైవంగా భావించి పూజిస్తున్నామని వారు తెలిపారు. స్వామి, అమ్మవార్ల ప్రతిమలతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకోవడం కూడా వారి పూర్వీకుల నుంచి ఆనవాయితీగా కొనసాగుతోందని చెప్పారు. ఆ ఆభరణాలను కూడా తమ పూర్వీకులు తయారు చేయించారని వెల్లడించారు. ఒంటిపై బంగారు నగలతో మెరిసిపోయిన వీరితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరచడం విశేషం.