ప్రధాని మోదీ కేబినెట్‌లో తెలంగాణకు రెండు లేదా మూడు పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. 2019లో 4 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మాత్రం ఓటింగ్ శాతాన్ని రెండింతలు పెంచుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు తన కేబినెట్లో మోదీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలవగా ఏడుగురు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కూడా కేంద్రమంత్రి పదవిని ఆశిస్తున్నారు. తెలంగాణ నుంచి ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు దక్కవచ్చునని భావిస్తున్నారు. కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్ రావులలో ఒకరికి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఇందులో కిషన్ రెడ్డి ముందున్నారని సమాచారం. ఇక, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, డాక్టర్ కే లక్ష్మణ్‌లలో ఇద్దరికి పదవులు రావొచ్చునని భావిస్తున్నారు. ఒక ఎంపీకి జాతీయ స్థాయిలో పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నారని చర్చ జరుగుతోంది.