ఏప్రిల్ 2.. భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. భారత గడ్డపై ప్రపంచకప్ ను సగర్వంగా ముద్దాడిన రోజు. 2011 ప్రపంచకప్ లో భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 2న జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 274 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. మరో 8 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచి భారత అభిమానుల చిరకాల కోరిక నెరవేర్చింది. గంభీర్, ధోని తమ అద్భుత ప్రదర్శనతో భారత్ కు ప్రపంచకప్ ను తీసుకొచ్చారు.
8 బంతులకు 6 పరుగులు కావాల్సిన సమయంలో ధోని, యువీ క్రీజులో ఉన్నారు.. ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. బ్యాటింగ్ చేస్తున్న ధోని భారీ సిక్సర్ కొట్టాడు. అంతే ప్రతి భారతీయుడి గుండె ఆనందంతో బరువెక్కింది. మాటల్లో.. రాతల్లో చెప్పలేని అనుభూతితో ఉప్పొంగిపోయారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన ఆ మధుర క్షణాలకు 12 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. దీంతో ఆ జ్ఞాపకాల్ని క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ధోని సిక్సర్ కొట్టిన సమయంలో ‘Dhoni finishes off in style’అంటూ రవిశాస్త్రి చెప్పిన కామెంటరీని తలుచుకొని ఎమోషనల్ ట్వీట్స్ చేస్తున్నారు.