Toll Tax: ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో సతమతమవుతోన్న ప్రజలకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుంది. ఈ సారి టోల్ గేట్ ఛార్జీలు(Toll Charges) పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచే పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) టోల్ ట్యాక్సులను పెంచనుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుమారు 5 శాతం నుంచి 10 శాతం మేర టోల్ ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది.
నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ధరలు సవరించాల్సి ఉంటుంది. దీంతో మార్చి చివరి వారంలో రహదారుల అథారిటీ చేసే సిఫార్సులను ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలించి ధరలపై ఏప్రిల్ 1న ప్రకటన చేయనుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం కార్లు, లైట్ వేట్ వెహికిల్స్‌కు 5శాతం, హెవీ వాహనాలకు 10శాతం పెంచనున్నారని సమాచారం. టోల్ గేట్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు ఇచ్చే నెలవారీ పాసుల ఛార్జీలు సైతం పెంచనున్నట్లు తెలుస్తోంది.