27.2 C
Hyderabad
Tuesday, March 11, 2025
spot_img

నవనీత మనస్కురాలిని అలుసుగా చూస్తే అపరకాళి – అన్నింటా ముందంటా..అది ఆడవారేనంట – మహిళా దినోత్సవం సందర్భంగా వనితాలోకానికి వందనాలు

ఓ చోట ఆడపిల్ల ఎడమ కాలి చెప్పుతో ఎదుటి వ్యక్తి కుడి చెంప మీద కొట్టింది. మరో చోట ఓ ఆడపిల్ల పోకిరీల వేధింపుల గురించి ఇంటి పెద్దలకు చెప్పింది. ఆ పెద్దలు పోలీసులకు చెప్పగా.. ఆ గుండా గ్యాంగ్ అరెస్టయ్యి జైలు కటకటాలు లెక్కెడుతున్నారు. ఈ ఇద్దరు ఆడపిల్లలు ఎవరో తెలుసా.. ఒకరు అసోం మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, రెండో వారు ప్రస్తుత కేంద్ర మంత్రి కుమార్తె. అంత పెద్ద పొలిటీషియన్ల సంతు కే ఇంతటి వేధింపులు జరుగుతుంటే.. సామాన్యులు, నిరుపేదల పిల్లల పరిస్థితి ఏమిటి …? అంటే అమ్మో…! ఈ మాట తల్చుకోవడమే భయంకల్గిస్తుందని ఎవరైనా వ్యాఖ్యానిస్తారు.

చెంప దెబ్బ కొట్టించుకున్న ఆ పురుషాధముడు ఎవరో తెలుసా… తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఓ నీచాధముడు. కొలువు కోసం కాళ్లావేళ్లాపడి కళ్లనీళ్లు పెట్టుకుంటే.. దయతల్చి.. మాజీ ముఖ్యమంత్రి కుటుంబం.. తమ కారు డ్రైవర్ గా ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింది. రెండు పూటల మేపుతూ.. నెల తిరిగే సరికి ఠంచన్ గా జీత భత్తాలు సమర్పిస్తుంటే.. ఈ కృతఘ్నడు.. ఇదివరలో రెండు మూడుసార్లు ఆమెపై అనుచితంగా ప్రవర్తించినా.. పోనీ పాపం అని ఆమె క్షమించింది. ఎందుకంటే.. ఆ డ్రైవర్ కుటుంబం రోడ్డున పడుతుందని భావించి, మరెప్పడు అలా ప్రవర్తించ వద్దని బుద్ది చెప్పి, గడ్డి పెట్టి వాహన చోదక ఉద్యోగంలో కంటిన్యూ చేసుకోమంది. కుక్క తోక వంకర.. ఈ బుద్ధి ఉన్నప్పుడు దుర్బుద్దులు కాక సద్బుద్దులు ఎందుకొస్తాయి… అంత సద్గుణ సంపన్నరాలు, దయాశీలురాలిపై.. లైంగిక దాడికి ప్రయత్నించాడు. అంతే.. ఆమె అపరకాళిలా మారి రౌద్ర రూపం దాల్చింది. చెప్పుతో ఎడాపెడా వాయించాక.. ఆమె కాళ్లపై పడ్డాడు. ఈ బుద్ది ముందుండాలి.. ఇంక చేతులు కాలినట్టే.. ఇక పత్రాలతో పనేంలేదు అనే స్థితి తెచ్చేసుకున్నాడు. కొలువుకు కాలం చెల్లిపోయింది. మనిషి రోడ్డున పడ్డాడు. కుటుంబాన్ని రోడ్డుపాలు చేశాడు.

అన్నింటా.. సమమంట.. అంటూ పురుషపుంగవులే…నిజాన్ని అంగీకరిస్తున్న వేళ…లేదు లేదు.. లేడిస్సే అన్నింటా ఫస్ట్ అని అందరూ ప్రశంసిస్తున్న సమయాన.. మత్తెక్కిన మత్తగజాల మాదిరి మదాందుల ప్రవర్తిస్తుంటే.. ఆ పొగరుబోతు మగ గజాలను ఏ అంకుశంతో, ఏ మావటి కంట్రోల్ చేయాలి..? గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నారు…ఎందుకు.. ఏ చిన్న నేరానికైనా.. అతి పెద్ద శిక్షలు ఉన్నందు వల్ల. ఎంత పెద్ద నేరం చేసినా, ఘోరాతి ఘోరం చేసినా, గూండాగిరికి పాల్పడినా.. గంటల్లోనో, రోజుల్లోనో బెయిల్ మీద బయటకి రావడం, ఏ రెయిలో ఎక్కి ఇంటికి రావడం.. తిరిగి నేరసామ్రాజ్యంలోకి దిగడం.. ఇదీ సమాజంలో తరచు జరుగుతున్న తంతు.

పురుష ప్రపంచం దద్దరిల్లే రీతిలో మహిళాలోకం తన సత్తా చూపుతోందని అర్థ శతాబ్దం క్రితం అంటే అయిదు దశాబ్దాల క్రితమే ఓ సినీ కవి.. తన గేయ రచనలో తెలిపారు. పల్లెటూళ్లలో పంచాయతీలు, పట్టణాల్లో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగాల్లో మగధీరులను ఎదిరించారని ఆ కవి.. ఆ నాడే అక్షరసత్యాలు వెల్లడించారు. 50 ఏళ్ల క్రితమే ఇంత మహిళా లోకం ప్రగతి సాధించినప్పుడు.. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్ మెంట్, మహిళా సాధికారత ఎంత గొప్పగా ఉండాలంటే టాప్ లెవల్లో ఉండాలని సమాధానం వస్తుంది. ఇప్పుడు నిజంగానే.. అంత టాప్ లెవెల్లో నారీమణులు అన్నింటా పురుషులతో సమానంగా ఉండడం కాదు.. మించిపోతున్నారు. విద్యార్థి లోకాన్ని తీసుకుంటే… అది టెన్త్, ఇంటర్, డిగ్రీ..ఎంసెట్, ఈ సెట్, ఆ సెట్, మరే కోర్సు తీసుకున్నా ర్యాంకుల పంట పండించడంలో కాని, ముందు ర్యాంకుల్లో నిలవడం కాని బాలికలే కావడం జరుగుతున్న విషయమే కదా.! గగన ప్రయాణం నుంచి సాగర గర్భ శోధన వరకు.. ఇందు, అందు.. అనే కాక.. ఎందెందైనా నారీమణులు….. సువర్ణ, రజిత, మకర, మాణిక్యమణుల్లా ప్రకాశిస్తున్నారు.

మృదల పుష్పాల్లా కొనియాడబడుతూ… సేవా పరిమళ శోభతో సమాజాభివృద్ధిలో తమ వంతు పాత్రను అద్భుత రీతిలో పోషిస్తూ శభాష్ అనిపించుకుంటున్న మహిళాలోకం.. అసురగణాలు, గుండా గ్యాంగ్ ల పాలిట సింహ స్వప్నంగాను, అపర కాళీలుగాను మారగలరు. హరిణాక్షి.. అంటే లేడి వంటి నేత్ర సోయగాలు గలది లేడీ. బిత్తర చూపులతో.. తత్తరపాటు గుణంతో సౌమ్యశీలిగా ఉండే స్త్రీమూర్తి కి చేటు వాటిల్ల చేస్తే.. మహిషాసు మర్దని అవతారం దాల్చగలదరు. అయితే, శ్రీకృష్ణుడు, శిశుపాల వధకు పావులు లెక్కబెట్టిన మాదిరి.. పురుషాహంకార ప్రపంచపు తప్పిదాలను ఎన్నింటినో ఓర్పు, సహనంతో భరిస్తూ ఉంటారు. మితి మీరినా, అతి ప్రదర్శించినా ఈ క్షమాగుణ సంపన్నులే… ప్రళయకాల రుద్రుల్లా క్రొధ జ్వాలలు వెదజల్లి దహించేయగలరు. అయితే…నవనీత మనస్కులైన నారీ మణులు..భూదేవి అంత సహనంతో వ్యవహరిస్తారు. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుని అలుసుగా భావిస్తే.. పాతకాలంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు మహిళాలోకం ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది.

అయితే, అకారణంగా చంపాలనుకుని, చావాలనుకునే మూర్ఘగ్రేసరులు కొందరు ప్రేమ పేరిటో, బలహీనులు, అబలలు అనే భావనలు బుర్రనిండా పెట్టేసుకుని.. తమ ప్రతాపం చూపడం జరుగుతోంది. ఎన్నో సందర్భాల్లో భంగపడి తోక ముడిచినా కొన్ని సందర్బాల్లో అబలలు బలైపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే.. నిందితులకు కఠిన శిక్షలు ఉండాలి. అయితే, ధనమదాందులు, తమ ఐశ్వర్య బలంతో… వాళ్లు నేరం చేసి, అమాయకులను కేసుల్లో ఇరికించి.. దర్జాగా ఈ నేరగాళ్లు సమాజంలో తిరగడం జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సివుంది.

వంటింటి కుందేలు.. అని మహిళలను ఇదివరలో కొందరు తక్కువ చేసి మాట్లాడేవారు. పంట సిరులు ఇంటికి చేర్చే అన్నదాత ఎంత గొప్పో… అన్నాన్ని వండిపెట్టి.. మృష్టాన్న భోజనాలు కడుపునిండా పెట్టి, ఇంటి వైభవాన్ని, కుటుంబ ఖ్యాతిని జగద్వితం చేసేది పూబంతి మనస్కులైన ఇంతులే. ఇంటికి దీపం ఇల్లాలు.. ఆ దీప కాంతుల కిరణాలు పిల్లలు అంటారు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అని సినీ కవి మాతృమూర్తికి మహత్తర గౌరవం ఇచ్చాడు. దేవుడు లేడనే మనిషి ఉండవచ్చుకాని.. అమ్మ లేదనే వాడు ఎవరూ ఉండరని, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకని, ఆ తల్లి సేవ చేసుకున్న బ్రతుకే బ్రతుకని ఆ కవి అద్భుత గేయ రచన చేశారు.

పురుష పుంగవునికి ఒక్కరోజు వంట ఇంటిలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తితే… అప్పుడు చూడాలి, ఆ వ్యక్తి చేసే వంట నిర్వాకం. అహర్నిశలు శ్రమిస్తూ.. స్త్రీ మూర్తి రెస్ట్ అనే పదాన్ని దూరం చేసుకుని.. ఆదివారం, సెలవుదినం అనే ఏ రోజులు పాటించకుండా.. ప్రతి నిత్యం చేసేత వంటకాలకు పేర్లు, పద్దులు పెట్టే మగరాయుళ్లు… తాము చేసిన వంట రుచి చూసుకుని. తేలుకుట్టిన దొంగల్లా మారతారు. ఎన్ని గంటలైనా ఆఫీస్ ఉద్యోగం చేస్తాం కాని.. ఒక్క గంట సైతం వంట చేయలేమని సీక్రెట్ గా అంగీకరించేస్తారు. అయితే, కొందరు తీరు మార్చుకోకుండా.. కూరలో ఉప్పెక్కువయ్యిందనో, పప్పులో ఉప్పు తక్కువైందనో.. సణుక్కోవడాలు, విసుక్కోవడాలు చేస్తూనే ఉంటారు. ఏం చేస్తాం.. ఇదోరకం మగబుద్ది.. అని నారీమణులు సర్దేసుకోవడాన్ని మనం చూస్తూఉంటాం.

నవీన యుగంలో దాదాపు నారీ లోకం అంతా బయట కొలువులు.. ఇంట్లో వంట పనులు చేస్తూ.. రెండింటికి న్యాయం చేస్తూ.. కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటోంది. అందుకే.. మరో సినీ కవి.. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని అన్నారు. యత్ర నార్యంతు పూజ్యంతే….రమంతే తత్ర దేవత.. ఎక్కడ నారీమణులు పూజింపబడతారో, ఎక్కడ గౌరవింపబడతారో … అక్కడ దేవతలు కొలువైవుంటారని.. ఆ ఇంట అష్ట ఐశ్వర్యాలు వెల్లివిరుస్తారని.. ఆ ఇంటిల్లపాది ఆయురారోగ్యాలతో జీవిస్తారని సనాతన సంప్రదాయాలు, పురాణేతిహాసాలు, ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కార్యేషు, కరణేషు, భోజ్యేషు… అనే అమృత శ్లోకంలో ఈ అమృతమూర్తికి… క్షమయా ధరిత్రీ.. అనే ఉన్నత స్థానం ఇచ్చారు. అంత గొప్ప నారీలోకం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో తలమునకలై ఉంది. మహిళాలోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఆ దేవతా మూర్తి అపార కీర్తిని గుర్తెరిగి.. ఆమె కంట ఏనాడు కడగండ్లు రానీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత యావత్ సమాజం పైనా ఉంది.

—————————

Latest Articles

కొక్కొరో కో అని అందరినీ నిద్ర లేపే కోళ్లకు కొక్కెర వ్యాధి – నానక్ నగర్ లో శాశ్వత నిద్రలోకి పన్నెండు వేల కోళ్లు

తెల్లవారక ముందే పల్లె లేస్తుంది. ఈ పల్లెను ప్రభాత సమయంలో కొక్కొరోకో పిలుపులతో మేలుకొలుపు పలికేవి కుక్కుటాలు. అందరిని తెల్లవారుజామునే నిద్ర లేపే గురుతర బాధ్యతలు తీసుకుని, విశిష్ట సేవలు అందిస్తున్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్