బాయ్ కాట్ లైలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో ఆ చిత్ర నిర్మాత సాహు తలపట్టుకుంటున్నాడు. ఎవరో ఏదో మాట్లాడితే కోట్లు ఖర్చు పెట్టి తీసిన తన సినిమాను బహిష్కరించడమేంటి అని.. షాక్ అవుతున్నాడు. సినిమాని అందరూ సినిమాలానే చూడండి.. అని వేడుకుంటున్నాడు. ఈవెంట్ కు గెస్ట్ లుగా వచ్చిన వాళ్లు ఏం మాట్లాడారో కూడా తనకు తెలియదంటున్నాడు.
అసలు ఏం జరిగింది..?
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉండేవని.. సినిమా చివరికి వచ్చేసరికి 11 మాత్రమే మిగిలాయి.. అదేమిటో అంటూ వైసీపీపై సెటైర్లు వేశాడు. ఇదే ఫంక్షన్ కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం, జనసేన అంటూ ప్రసంగం చేసి సినిమా ఈవెంట్ ని కాస్తా.. పొలిటికల్ ఈవెంట్ కింద మార్చేశారు. ఇక ఇది విన్న వైసీపీకి ఎక్కడో కాలింది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అంటూ ట్యాగ్ లైన్ తో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు.
సినిమా ఫంక్షన్లు, పొలిటికల్ ఈవెంట్ లను వేర్వేరుగా చూడాలి. రెండు రంగాల్లో ఉన్నవాళ్లు సందర్భానుసారంగా మాట్లాడాలి. అంతేకానీ ఎంటర్ టైన్ మెంట్ లో పొలిటికల్ కామెంట్స్ చేస్తే వాళ్లదేం పోయిద్ది.. పోయేదంతా నిర్మాతదే కదా. ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక లైలా సినిమా నిర్మాత సాహు, హీరో విశ్వక్సేన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ఇద్దరూ రంగంలోకి దిగి .. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ కామెంట్స్ కి సినిమాకి సంబంధం లేదని చెప్పడం మొదలుపెట్టారు.
పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ అంటే సినిమా ఎలా బతకాలి.. అని విశ్వక్సేన్ మొరపెట్టుకుంటున్నాడు. చాలా కష్టపడి సినిమా తీశాం.. ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నానని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. తమ ప్రమేయం లేకుండా జరిగిన దానికి సినిమాని బలి చేయొద్దని వేడుకున్నాడు. తమకు ప్రమేయం లేకున్నా సారీ చెబుతున్నానని అన్నాడు. నిర్మాత, హీరో విన్నపాలను ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించుకుంటారో చూడాలి మరి..!