భార్యభర్తల మధ్య అన్యోన్యం.. ఆ ఇంటికి పండుగ. ఇద్దరి మధ్య కలహం.. ఆ ఇంటికి శాపం. చిన్నపాటి గొడవలను కూడా పరిష్కరించుకోలేక ప్రాణాలు తీయడమో.. తీసుకోవడమో చేస్తున్నారు. ఇది ఆ ఇంటి భవిష్యత్తును అగాధంలోకి నెట్టేస్తుంది. చాలా ఘటనల్లో పిల్లలు అనాథలవ్వడం చూశాం.
సికింద్రాబాద్ లో కూడా ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ ప్యాట్నీలో ఉన్న కామాక్షి సిల్క్స్ షాప్ లోనే శ్రావణ్ అనే వ్యక్తి నిప్పు పెట్టుకున్నాడు. భార్య మౌనిక షాపులో పని చేస్తుండగా భార్యతో గొడవ పడ్డాడు. షో రూమ్ సిబ్బంది, అక్కడికి వచ్చిన కస్టమర్లు .. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. భార్యపై పంతమో.. మనస్తాపమో, బెదిరించడానికి చేసిన ప్రయత్నమో.. తెలియదు కానీ.. ఆత్మహత్యాయత్నం చేశాడు.
అతనికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో వినియోగదారులు ఉండగానే ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆత్మహత్యాయత్న ఘటనలో గాయపడిన శ్రావణ్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న మహంకాళి ఏసీబీ సర్దార్ సింగ్ ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దుకాణంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దుకాణంలో ఉన్న అగ్నిమాపక యంత్ర సహాయంతో పొగలను అదుపులోకి తీసుకువచ్చారు.