అమెరికా విషయంలో కెనడా యూ టర్న్ తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ తయారీలో తాము కూడా భాగస్వామి అవుతామని కెనడా పేర్కొంది. ఈ మేరకు కెనడా మంత్రి బిల్ బ్లేయర్ వెల్లడించారు. బిల్ బ్లేయర్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఐరన్ డోమ్ వ్యవస్థ తయారీ అంశాన్ని బిల్ బ్లేయర్ ప్రస్తావించారు. అమెరికాకు కెనడా అత్యంత కీలక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఉత్తర అమెరికా పరిరక్షణకు కెనడా కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా నాటో, నార్త్ అమెరికన్ ఏరో స్పేస్ డిఫెన్స్ తో కెనడా కలిసి పనిచేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ తయారీలో భాగస్వామి కావడానికి కెనడా సిద్ధంగా ఉందన్నారు బిల్ బ్లేయర్.
అమెరికా, కెనడా మధ్య కొంతకాలంగా సంబంధాలు బాగాలేవు. ప్రధానంగా కెనడా నుంచి పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించారని ట్రంప్ గతంలో అనేకసార్లు ఆరోపించారు. ప్రధానంగా ఎన్నికల ప్రచార సమయంలో ఈ ఆరోపణలు చేశారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా – కెనడా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఒక దశలో కెనడా, అమెరికాలో విలీనమవ్వాలన్న ప్రతిపాదన కూడా ట్రంప్ చేశారు. అయితే ట్రంప్ ప్రతిపాదనకు కెనడాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కెనడా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి అమెరికా కుట్ర చేస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదొక్కటే కాదు జస్టిన్ ట్రూడో ను ఇంటికి పంపడంలో అమెరికా పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు ఇటీవల కెనడాపై అమెరికా సుంకాలు కూడా విధించింది. అయితే సరిహద్దుల్లో భద్రత ను కట్టుదిట్టం చేస్తామని హామీ ఇవ్వడంతో కెనడాపై సుంకాల అమలుకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది ట్రంప్ సర్కార్. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా కు అవసరమైన సైనిక సహకారం అందిస్తామని కెనడా మంత్రి బిల్ బ్లేయర్ పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరచింది.
ఐరన్ డోమ్ …ఇదొక మిసైల్ వ్యవస్థ. దీనిపై ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అత్యాధునిక మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇదే ఐరన్ డోమ్ మిస్సైల్ వ్యవస్థగా పాపులర్. వాస్తవానికి ఐరన్ డోమ్ మిస్సైల్ వ్యవస్థను ఇప్పటికే ఇజ్రాయెల్ ఉపయోగిస్తోంది. 2011లోనే ఐరన్ డోమ్ వ్యవస్థను ఇజ్రాయెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దాదాపు 90 శాతం కచ్చితత్వంతో గగనతల లక్ష్యాలను ఐరన్ డోమ్ మిస్సైల్ వ్యవస్థ కూల్చి వేస్తుందని రక్షణ వర్గ నిపుణులు చెబుతారు.
ఉత్తర అమెరికా ఖండంలోని ఓ చిన్నదేశమైన కెనడా కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే ఖలిస్థాన్ ఉద్యమాన్ని కొంతకాలంగా ఎగదోస్తోంది. ఇదేదో గాలి పోగేసి చేస్తున్న ఆరోపణలు కావు. ఇందుకు సంబంధించి భారతదేశం దగ్గర పక్కా ఆధారాలున్నాయి. కెనడాలోని హిందూ దేవాలయాలపై ఇటీవలికాలంలో తరచూ దాడులు జరుగుతున్నాయి. దాడులు చేయడంతోపాటు ఆలయాలపై ఖలిస్థాన్ ఉద్యమ అనుకూల నినాదాలు కూడా కనిపిస్తున్నాయి. కెనడాలో ఖలిస్థాన్ ఉద్యమకారులు ఇటీవలికాలంలో అనేక హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఈ హింసాత్మక కార్యకలాపాల వెనుక కెనడా ప్రభుత్వ హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.