అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా, చైనాపై సుంకాల కొరడా ఝళిపించిన తర్వాత మరో కీలక నిర్ణయం ప్రకటించారు. ట్రంప్ ఆదివారం యూరోపియన్ యూనియన్ వస్తువుల దిగుమతులపై సుంకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు.
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్‌పై కొత్త సుంకాలను “ఖచ్చితంగా” విధిస్తాను, వారు “నిజంగా మమ్మల్ని సద్వినియోగం చేసుకున్నారు”. “ఒక కాలక్రమం ఉందని నేను చెప్పను, కాని ఇది చాలా త్వరగా జరుగుతుంది” అని విలేకరులతో మాట్లాడుతూ 27-దేశాల కూటమితో యుఎస్ వాణిజ్య లోటు గురించి ఫిర్యాదులను పునరుద్ఘాటించాడు.
ట్రంప్ అంతకుముందు యూరోపియన్ యూనియన్‌పై సుంకాలు తప్పవని బెదిరించారు. వాటిని “ఖచ్చితంగా” వర్తింపజేస్తానని చెప్పాడు. “యూరోపియన్ యూనియన్ మాతో చాలా భయంకరంగా వ్యవహరించింది” అని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో అన్నారు. ఈ వాణిజ్య యుద్ధం అమెరికా వృద్ధిని మందగించి ధరల పెంపుకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, అమెరికా అధ్యక్షుడు సుంకాలను విధిస్తే “గట్టిగా స్పందిస్తామని” యూరిపోయన్ యూనియన్ ఆదివారం తెలిపింది. “ఈయూ వస్తువులపై అన్యాయంగా లేదా ఏకపక్షంగా సుంకాలను విధించే ఏ వాణిజ్య భాగస్వామికి ఈయూ గట్టిగా బదులిస్తుంది” అని కెనడా, చైనా మరియు మెక్సికోపై ట్రంప్ సుంకాలపై మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రతినిధి చెప్పారు.
వాణిజ్య భాగస్వాములతో ఢీ అంటే ఢీ
అమెరికా తన వాణిజ్య భాగస్వాములతో ఢీ అంటే ఢీ అంటోంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ప్రజల జీవన వ్యయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాల విధింపుతో అమెరికన్లు ఆ భారం మోయక తప్పదని అంటున్నారు. పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా సరుకులపై 25 శాతం టారిఫ్ విధించారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10 శాతం సుంకాలు విధించారు. ఈ మేరకు ట్రంప్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఫెంటానిల్ రవాణా, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇక ట్రంప్ చర్యతో ఆ దేశ ద్రవ్యోల్బణం పెరగనుంది. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి, అమెరికన్ల కష్టాలు రెట్టింపు అవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా.. ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తామూ 25శాతం టారిఫ్ విధించనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్‌పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఉద్ఘాటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్ చర్యకు ఇతర దేశాలూ స్పందిస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా పరిణామంపై మెక్సికో అధ్యక్షురాలు షీన్‌బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర ముఠాలకు మెక్సికో ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. స్వదేశీ ప్రయోజనాలను పరిరక్షించేలా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాలని ఆర్థిక మంత్రిని తాను ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. అమెరికాలో ఫెంటానిల్ వాడకాన్ని కట్టడి చేయాలన్నది ట్రంప్ ఉద్దేశమైతే.. దేశీయంగా అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలే తప్ప, ఇతర దేశాలపై సుంకం విధించడం సరికాదంటూ మండిపడ్డారు.