ప్రపంచవ్యాప్త ఆర్థిక సవాళ్లు.. అన్నివర్గాల ప్రజల నుంచి పెద్దఎత్తున ఆకాంక్షలు.. వికసిత భారత్ లక్ష్యాలు.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల వినతులు..ప్రతిపక్షాల నిరసనలు… ఇన్నింటి నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను నిన్న లోక్ సభలో ప్రవేశ పెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.50.65 లక్షల కోట్ల అంచనాలతో శనివారం లోక్‌సభలో భారీ బడ్జెట్టును సమర్పించారు. వరుసగా 8వ సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు బడ్జెట్ లో పలు కీలక చర్యలను ప్రకటించారు. వేతనజీవుల్లో ఎక్కువమంది ఆదాయ పన్ను భారంతో సతమతం అవుతుండటంతో వారికి ఊరటనిచ్చారు. ఏడాదిలో 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించేవారికి పన్నుభారం లేకుండా చేశారు. వ్యవసాయం, MSME, పెట్టుబడులు, ఎగుమతులు అనే నాలుగు చోదక శక్తులతో భారత అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. . ఈ సందర్భంగా మాట్లాడుతూ… పన్నులు, విద్యుత్ రంగం, పట్టణాభివృధ్ది, మైనింగ్, ఆర్థికరంగం, క్రమబద్ధీకరణ సంస్కరణలు అనే ఆరు అంశాల్లో వచ్చే ఐదేళ్లలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. రైతులు, యువత, పేదలు, మహిళలను కేంద్రంగా చేసుకుని బడ్జెట్ లో పలు అభివృద్ధి చర్యలను ప్రకటించినట్లు తెలియజేశారు. వ్యవసాయం, అభివృద్ధి, గ్రామీణ వికాసం, సమ్మిళిత అభివృద్ధి, MSME లు తదితర 10 అంశాల్లో నూతన చర్యలను బడ్జెట్ లో ప్రతిపాదించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం 50.65 లక్షల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించారు. వ్యవసాయం, MSME లు, విద్య, పరిశోధన తదితర రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారు.. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరిగేందుకు, మధ్యతరగతి ప్రజల వినిమయ శక్తి పెరిగేలా పలు కీలక చర్యలను బడ్జెట్ లో ఆర్థికమంత్రి ప్రకటించారు. పేదరిక నిర్మూలనే బడ్జెట్ లక్ష్యమని పేర్కొన్నారు. సమ్మిలితాన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని ప్రాంతల సమ తుల్య అభివృద్ధి లక్ష్యంతో వికసిత్ భారత్ దిశగా వచ్చే ఐదేళ్లలో తీసుకునే చర్యలను రోడ్ మ్యాప్ ప్రకటించారు. ” దేశమంటే మట్టి కాదోయ్ ..దేశమంటే మనుషు లోయ్ “” అన్న ప్రముఖ కవి గురజాడ అప్పారావు మాటలను ఉటంకిస్తూ మానవ వనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా 50లక్షల 65వేల 345 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను 34లక్షల 20వేల 409 కోట్ల రూపాయల అంచనా వేశారు. మూలధన వసూళ్లలో 16లక్షల 44వేల 936 కోట్ల రూపాయలుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఈసారి కేంద్ర బడ్జెట్లో రక్షణరంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కాగా రక్షణరంగానికి 4 లక్షల 91వేల 732 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి 2 లక్షల 66వేల 817 కోట్ల రూపాయలు కేటాయించగా.. హోంశాఖకు 2లక్షల 33వేల 211 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరోవైపు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా భారీగా కేటాయింపులు చేశారు. వ్యవసాయానికి లక్ష 71వేల 437 కోట్ల రూపాయలు, విద్యారంగానికి లక్ష 28వేల 650 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక ఆరోగ్యరంగానికి 98వేల 311 కోట్ల రూపాయలు కేటాయించగా… పట్టణాభివృద్ధి రంగానికి 96వేల 777 కోట్ల రూపాయలు కేటాయించారు. ఐటీ, టెలికాం రంగానికి 95వేల 298 కోట్ల రూపాయలు, ఇంధన రంగం 81వేల 174 కోట్ల రూపాయలు కేటాయించగా.. వాణిజ్యం, పారిశ్రామికం 65వేల 553 కోట్ల రూపాయలు, సామాజిక సంక్షేమం 60వేల 52 కోట్ల రూపాయలు, శాస్త్ర సాంకేతిక రంగానికి 55వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు.
—
మొత్తం బడ్జెట్- రూ.50,65,345 కోట్లు
రెవెన్యూ వసూళ్లు- రూ.34,20,409 కోట్లు
పన్ను వసూళ్లు- రూ.28,37,409 కోట్లు
పన్నేతర వసూళ్లు- రూ.5,83,000 కోట్లు
మూలధన వసూళ్లు- రూ.16,44,936 కోట్లు
రుణాల రికవరీ- రూ.29,000 కోట్లు
ఇతర వసూళ్లు- రూ.47,000 కోట్లు
అప్పులు, ఇతర వసూళ్లు- రూ.15,68,936 కోట్లు
రంగాలు కేటాయింపులు
రక్షణరంగం- రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృ- రూ.2,66,817 కోట్లు
హోంశాఖ- రూ.2,33,211 కోట్లు
వ్యవసాయం- రూ.1,71,437 కోట్లు
విద్యారంగం- రూ.1,28,650 కోట్లు
ఆరోగ్యరంగం- రూ.98,311 కోట్లు
పట్టణాభివృద్ధి రంగం- రూ.96,777 కోట్లు
ఐటీ, టెలికాం- రూ.95,298 కోట్లు
ఇంధన రంగం- రూ.81,174 కోట్లు
వాణిజ్యం, పారిశ్రామికం- రూ.65,553 కోట్లు
సామాజిక సంక్షేమం- రూ.60,052 కోట్లు
శాస్త్ర సాంకేతిక రంగం- రూ.55,679 కోట్లు