ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. సవరించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువల సవరణ చేస్తూ..ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించింది. రేపటి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి.
విజయనగరం జిల్లా బొబ్బిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచే కొనుగోలుదారులు క్యూ కట్టారు. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖర్చు తగ్గుతాయని కార్యాలయానికి పెద్ద సంఖ్యలు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సర్వర్లు మొరాయించాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక, ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయని కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. కొత్తగా కార్పొరేషన్‌లో విలీనమైన శివారు ప్రాంతాల్లో వందశాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచనున్నారు. మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రద్దీ కనిపిస్తోంది. జిల్లాలో 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది నెలకొంది.
రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు ఆఫీసులకు భారీగా రావడంతో..ఉమ్మడి విశాఖ జిల్లాలో పలుచోట్ల సర్వర్లు మొరాయించాయి. ఉదయం నుంచి పడిగాపులు కాశారు. మరికొన్ని చోట్ల ఖాళీగా దర్శనమించాయి. మరోవైపు పెరిగే రిజిస్ట్రేషన్ల ధరలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనం కిక్కిరిసిపోతున్నారు. నిన్న ఒకరోజు దాదాపు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాధారణంగా ప్రతిరోజు జరిగే రిజిస్ట్రేషన్లకు రెండింతలు ఎక్కువ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక అన్నమయ్య జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. గురువారం రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు సైతం రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.
గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. రేపటి నుంచి భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. కొత్త రేట్లు అమలులోకి వస్తే రిజిస్ట్రేషన్ టాక్స్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఉదయం నుండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు క్రయవిక్రయదారులతో నిండిపోయింది. మామూలు రోజుల కంటే మూడు రెట్లు రిజిస్ట్రేషన్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.