విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తామని తెలిపారు. సెయిల్‌లో విలీనం కంటే ముందు ప్లాంట్ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో విలీనం అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కుమారస్వామి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
“ఉక్కు శాఖ మంత్రిగా నేను బాధ్యతలు చేపట్టగానే అనేక సమీక్షలు చేశాం. ఉక్కు ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్ ఉంది. అగ్రస్థానంలోకి రావాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖ ఉక్కు సాధన కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి తో 2014 వరకు బాగానే ఉంది. దేశానికి రూ. 45,000 కోట్ల మేర ఆదాయంగా మారింది. నవరత్న హోదా కూడా వచ్చింది.
రూ.11,000 కోట్లతో ఉత్పత్తి పెంచాలని నిర్దేశంతో నష్టాలు వచ్చాయి. లక్ష్యం భారంగా మారింది. సొంత గనులు లేకపోవడం కారణం. బ్యాంక్‌ల అప్పులు భారంగా మారాయి. దీంతో పెట్టుబడులు ఉపసంహరణకు కేంద్ర నిర్ణయించింది. ఆర్‌ఐఎన్ఎల్‌కు రూ. 35,000 కోట్ల అప్పులు ఇప్పుడు భారంగా ఉన్నాయి. జూన్ లో వచ్చినపుడు ప్రైవేటీకరణ సరికాదని, పునరుద్దరణ చేయాలని భావించాం. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కలిసి ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేశారు. చివరకు ప్రధాని మోదీ అందరి విజ్ఞప్తి మేరకు ప్యాకేజీకి అంగీకరించారు. రెండు బ్లాస్ట్ ఫర్బేసస్ లను పునరుద్దరణ చేయాలని నిర్ణయించాం.
ఆర్‌ఐఎన్ఎల్‌ను సక్సెస్ ఫుల్ గా నడిపేందుకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాం. ప్యాకేజీని సమర్ధంగా వినియోగం కోసం రోడ్ మ్యాప్ పై కసరత్తు చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్‌ను మళ్ళీ నెంబర్- 1 చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. రెండు, మూడు నెలల్లో కార్మిక సమస్యలకు పరిష్కారం చూపుతాం. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నాం. కెప్టివ్ మైనింగ్ అంశాన్ని కూడా పరిశీలిస్తాం. సెయిల్‌లో విలీనం కంటే ముందు ప్లాంట్ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. భవిష్యత్తులో విలీనం అంశాన్ని పరిశీలిస్తాం”.. అని కుమారస్వామి తెలిపారు.