బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గాయాల నుంచి కోలుకుంటున్నాడు. జనవరి 16 న తన బాంద్రా ఇంటిలో ఓ అగంతుకుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్‌కు.. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేశారు వైద్యులు. తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగివచ్చాడు. తాజాగా కొడుకు ఇబ్రహీంతో సైఫ్ అలీఖాన్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఫోటోలో సైఫ్ అలీఖాన్ నవ్వుతూ కెమెరాకు పోజిచ్చాడు. కాజువల్ డ్రెస్‌లో కొడుకు ఇబ్రహీంతో ఉన్నాడు. ఈ ఫోటోని దవి బెయిన్స్ గిల్ అనే ఫ్యాషన్ డిజైనర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఖాన్స్‌తో లంచ్ సమయంలో దిగిన ఫోటో అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే..మంగళవారం, కరీనా కపూర్ బృందం ముంబై ఫోటోగ్రాఫర్స్‌తో సమావేశమైంది. ఆంగ్ల పత్రిక నివేదిక ప్రకారం.. వారి పిల్లలు తైమూర్ , జెహ్ చిత్రాలను తీయవద్దని ఆమె అభ్యర్థించినట్టు తెలుస్తోంది.
భద్రతా సమస్యల దృష్ట్యా తమ ఇంటి ముందు ఫోటోల కోసం ఎవరూ గుమికూడవద్దని సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ దంపతులు అభ్యర్థించారు. మరోవైపు తమ ఇంటి దగ్గర భద్రతను పెంచుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం నటుడు రోనిత్ రాయ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు.
నటుడు సైఫ్ అలీఖాన్ జనవరి 16న తన ఇంట్లో ఓ అగంతకుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అగంతకుడు సైఫ్‌ను 6 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన షెరీఫుల్ ఇస్లామ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను భారత్‌లోకి అక్రమంగా చొరబడి బిజాయ్ దాస్‌గా చలామణి అవుతున్నట్లుగా గుర్తించారు. అంతేకాదు సైఫ్ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడి సైఫ్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నిందితుడు షెరీఫుల్ ఇస్లామ్ ఏ మహిళ ఆధార్ కార్డ్ ఉపయోగించయితే సిమ్ కార్డు తీసుకున్నాడో.. ఆ మహిళ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆమెను వెస్ట్ బెంగాల్‌కు చెందిన మహిళగా గుర్తించారు.