లీలావతి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. చారిత్రక పటౌడీ కుటుంబానికి చెందిన రూ. 15,000 కోట్ల ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రభుత్వం ఒక అడుగు దూరంలో ఉంది. . ఈ ఆస్తులన్నీ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందినవి. దీనికి సంబంధించిన పలు వివాదాలు న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి.
ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు, ఈ ఆస్తులపై విధించిన స్టేను ఎత్తివేసింది. శత్రువుల ఆస్తి చట్టం, 1968 ప్రకారం వాటిని స్వాధీనం చేసుకోవడానికి మార్గం సుగమమైంది.
నూర్-ఉస్-సబా ప్యాలెస్, దార్-ఉస్-సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహెఫిజా ప్రాపర్టీతో పాటు సైఫ్ అలీ ఖాన్ తన బాల్యాన్ని గడిపిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్.. ఇవన్నీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ఆస్తులు.
ఈ కేసులో అప్పీలేట్ అథారిటీ ముందు తమ వాదనలను వినిపించాలని సైఫ్ అలీఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహ, సబా అలీఖాన్, పటౌడీ సోదరి సబీహ సుల్తాన్‌లను హైకోర్టు ఆదేశించింది.
ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం.. విభజన తర్వాత భారత్ నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లిన వ్యక్తులకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు. అతని పెద్దకుమర్తె అబిదా సుల్తాన్, 1950లో పాకిస్థాన్‌కు వలసవెళ్లారు. రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్, భారతదేశంలోనే ఉండి నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. ఆమె నవాబ్ ఆస్తులకు చట్టబద్ధమైన వారసురాలు అయ్యారు.
సాజిదా మనవడు సైఫ్ అలీఖాన్ ఆస్తుల్లో కొంత భాగాన్ని వారసత్వంగా పొందాడు. ఏది ఏమైనప్పటికీ, అబిదా సుల్తాన్ పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోవడంతో ఈ ఆస్తులను “శత్రువు ఆస్తి”గా పేర్కొనడానికి కేంద్రానికి అవకాశం లభించింది.
2019లో, న్యాయస్థానం సాజిదా సుల్తాన్‌ను చట్టబద్ధమైన వారసురాలిగా గుర్తించింది. అయితే ఇటీవలి తీర్పు కుటుంబ ఆస్తి వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
గత 72 ఏళ్లలో ఈ ఆస్తుల యాజమాన్య రికార్డులను పరిశీలించే ప్రణాళికలను భోపాల్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఈ భూముల్లో ఉంటున్న వ్యక్తులను రాష్ట్ర లీజు చట్టాల ప్రకారం అద్దెకు ఉంటున్నవారిగా పరిగణించవచ్చని ఆయన అన్నారు.
ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటానని అంటోంది.. కానీ చాలా ఆస్తులను అమ్మేశారు.. కొన్నింటిని సంవత్సరాలుగా లీజుకు ఇచ్చారు.. అని స్థానికులు అంటున్నారు.
గవర్నమెంట్ ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉండటంతో 1.5 లక్షల మంది నివాసితులు ఆందోళనలో ఉన్నారు. సర్వేలు నిర్వహించి యాజమానులను నిర్ణయించే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్లడంతో చాలామంది భయపడుతున్నారు. తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్‌లో ఈ ఉత్తర్వులను సవాల్ చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం.