పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 16న ప్రారంభమయ్యే పర్యటనలో భాగంగా మొదట సింగపూర్‌లో పర్యటిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అట్నుంచటే విదేశీ టూర్‌కు వెళ్లనున్నారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై చర్చిస్తారు ముఖ్యమంత్రి. సింగపూర్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే అంశంపైనా అక్కడి అధికారులతో చర్చిస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 19 వరకు ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన కొనసాగనుంది.
జనవరి 20 నుంచి 22 వరకు స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తారు సీఎం రేవంత్. దావోస్‌లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ పాలసీ సహా ఇతర అంశాలను ప్రస్తావిస్తారు ముఖ్యమంత్రి. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని వివరాలను సిద్ధం చేశారు.
ఇక, పెట్టుబడులు అంటేనే తెలంగాణ అనేలా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటనకు వెళ్లనున్న వేళ గతేడాది వచ్చిన పెట్టుబడులు ఎన్ని.. కార్యరూపం దాల్చినవి ఎన్ని అనే అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
గతేడాది సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మొత్తం 40 వేల 232 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని వెల్లడించింది ప్రభుత్వం. ఇదే అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సమీక్షా సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిపై వివరణ ఇచ్చారు. దాదాపుగా 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని.. వాటిలో 17 ప్రారంభమయ్యాయని వెల్లడించారు.