ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో తాము ఇద్దరం పరస్పరం తిట్టుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈవో శ్యామలరావు సంయుక్త ప్రకటన చేశారు. టీటీడీ మీడియా సమావేశంలో వాళ్లిద్దరూ మాట్లాడారు. బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను భక్తులు నమ్మొద్దని కోరారు. కొంత మంది పనిగట్టుకొని తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు,. వాస్తవం తెలుసుకొని వార్తలు రాయాలని హెచ్చరించారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని కథలు అల్లడం సరైన పద్ధతి కాదన్నారు.
జనవరి 8న జరిగిన ఘటన దురదృష్టకరమని బీఆర్ఎస్ నాయుడు అన్నారు., అది చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. మరో ఇద్దరికి సీరియస్‌గా ఉందని తెలిపారు. కోలుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వస్థలాలకు పంపించామన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు మూడు ప్రత్యేక బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు చెక్కులను అందించారని స్పష్టం చేశారు. సుమారు 31 మందికి చెక్కులు ఇవ్వడం జరిగిందని.. మరో 20 మందికి ఇవ్వాల్సి ఉంది.. వారికి మరో రెండు రోజుల్లో చెక్కులను అందజేస్తామన్నారు.
అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. టీటీడీపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజీగా ఉండటం వల్ల సమయం లేకపోవడంతో సోషల్ మీడియా వార్తలపై స్పందించ లేదని అన్నారు. వాటిని ఖండించేదుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.
టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోకి పడటం లేదని కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని.. ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. తమలో ఎక్కడా సమన్వయ లోపం లేదన్నారు.. కలిసి కట్టుగానే పని చేస్తున్నామని వివరించారు. టీటీడీ చైర్మన్‌ను తాను కానీ.. ఆయన తనను కానీ ఏకవచనంతో సంబోధించ లేదని చెప్పారు. తాము భాధ్యత తీసుకున్న అనంతరం టీటీడీ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకు వచ్చామని.. మరి కొన్నింటిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని ఈవో శ్యామలరావు వివరణ ఇచ్చారు.