ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పని ముగిసిందా? ప్రస్తుతం పార్టీని నడిపించే పెద్ద దిక్కు లేకుండా పోయిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అంతా తానై వ్యవహరించారు. సిట్టింగుల కోటాలో తనకే టికెట్ వస్తుందనే ధీమాతో మరింతగా చెలరేగిపోయి.. పార్టీ పటిష్టతపై అసలు దృష్టి పెట్టలేదట. తీరా ఓడిపోయిన తర్వాత కనీసం పార్టీ కార్యాలయం వైపు కూడా చూడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అదే మహబూబాబాద్ నియోజకవర్గం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు ఇప్పుడు పార్టీ గుమ్మం కూడా తొక్కడం లేదట. దీంతో బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా తాళాలు వేసేసినట్లు టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పార్టీకి అంత దారుణమైన స్థితి ఉన్నా.. నాయకులు మాత్రం ఎవరూ బయటకు రావడం లేదట.
బీఆర్ఎస్ హయాంలో అధినేత కేసీఆర్.. తన పార్టీ ఎమ్మెల్యేలకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. దీంతో తాము చెప్పిందే వేదంలా మారింది. నియోజకవర్గాన్ని చిన్న సైజు రాజ్యంగా మార్చుకుకొని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజుల్లా ఫీలయ్యేవారనే టాక్ ఉండేది. అప్పట్లో వారి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. సొంత పార్టీ నేతలను కూడా పట్టించుకోకుండా.. ఎమ్మెల్యేలే ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేసిన బానోతు శంకర్ నాయక్.. అవినీతిలో ఆరితేరిపోయారనే వార్తలు వచ్చాయి. తనకు నచ్చిన వారికి మాత్రమే పనులు చేస్తూ.. ఆఖరుకు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా దూరం పెట్టారనే ప్రచారం జరిగింది. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు.. శంకర్ నాయక్ బెదిరించని అధికారి లేడనే టాక్ వినిపించింది.
అప్పట్లో తాను చెప్పినట్లు చేయకపోతే కేసీఆర్‌కు చెప్పి ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని.. ఎక్కడా పోస్టింగ్ కూడా దక్కదంటూ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు శంకర్ నాయక్ పైన వచ్చాయి. ఆమె ఐఏఎస్ సంఘానికి, జిల్లా ఎస్పీకి ఈ విషయంలో ఫిర్యాదు కూడా చేశారు. కానీ శంకర్ నాయక్ తాను అనుకున్నట్లే కలెక్టర్‌ను బదిలీ చేయించారు. అలా అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ అండ చూసుకొని శంకర్ నాయక్ చెలరేగిపోయేవారని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత శంకర్ నాయక్ అసలు ప్రజల్లో కూడా కనపడటం లేదట. మహబూబాబాద్ నుంచి తన మకాంను సొంత గ్రామం.. పాలకుర్తి నియోజకవర్గంలోని ఊకల్ గ్రామానికి మార్చారట. అసలు మహబూబాబాద్ బీఆర్ఎస్‌ను పూర్తిగా పట్టించుకోవడం మానేశారట.
ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానం పలు నిరసన, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గాల వారీగా ఆందోలనలు చేపట్టాలని జిల్లా నాయకులకు ఆదేశాలిచ్చింది. అప్పుడు కూడా శంకర్ నాయక్ అసలు మహబూబాబాద్ వైపు తొంగి చూడలేదట. దీంతో ఆ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు తమ కష్టనష్టాలను ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నారట. ఒక్క ఓటమికే పార్టీ కార్యాలయానికి తాళాలు వేసుకోవడం ఏంటని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన నాయకులు.. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా.. తమ సొంత పనులు చేసుకుంటున్నారని మండిపడుతున్నారట.