మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు.. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి జోరు కనబరుస్తోంది. అటు ఝార్ఖండ్‌లోనూ బీజేపీ ముందంజలో ఉంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి 68 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 26 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ సౌత్ వెస్ట్‌లోబీజేపీ అభ్యర్థి, రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆధిక్యంలో ఉన్నారు.కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే ముందంజలో కొనసాగుతున్నారు. బారామతిలో NCP అభ్యర్థి అజిత్ పవార్ ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు.
ఝార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 5, JMM నేతృత్వంలోని కూటమి 3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. బర్హెత్‌లో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండేలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ నుంచి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.