ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు అమరావతిలో మంత్రి వర్గం సమావేశం కాబోతుంది. ఇందులో ప్రధానంగా.. రాజధాని అమరావతి అభివృద్ధిపై చర్చిస్తారని తెలుస్తోంది. అమరావతికి సంబంధించి ఇదివరకు కాంట్రాక్టర్‌కు ఇచ్చిన పనుల టెండర్ల రద్దును మంత్రిమండలి ఆమోదించే ఛాన్స్ ఉంది. ఆ పనులకు కొత్త టెండర్లు పిలిచే అంశంపై చర్చ జరుగనుంది. అలాగే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంశంపై చర్చ జరగనుంది. పోలవరం కార్యాచరణపైనా చర్చించనుంది మంత్రివర్గం. కొత్త పాలసీలు, బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. కేంద్రం సహకరించాలని పదే పదే సీఎం చంద్రబాబు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ఈ పథకాలపైనా చర్చ జరగనుంది. పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది. త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20 వేలు కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. కానీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలకు 1500పై మాట్లాడట్లేదు. తల్లికి వందనం ఊసే ఎత్తట్లేదు. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడట్లేదు. ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.