తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అమరేశ్వర , కపిల మల్లేశ్వర , లక్ష్మనేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నర్సాపురంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే వశిష్ట గోదావరిలో భక్తులు పుణ్యస్నానమాచరించి కార్తీకదీపం విడిచిపెట్టారు. కార్తీక మాసంలో పవిత్రమైన రోజు కావడంతో భక్తులు స్వామివారికి అభిషేకాలు చేయించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఏలూరు జిల్లలోనూ కార్తీక శోభ సంతరించుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉప దేవాలయమైన.. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి శివాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో బారులు తీరారు. శివాలయంలోని ఉసిరి, జమ్మి చెట్టు వద్ద.. మహిళలు 365 ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తుల రద్దీ దృష్యా ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద.. భక్తులు పెద్ద సంఖ్యలో కార్తీక స్నానాలు ఆచరించారు. సాగర హారతితో సముద్ర స్నానాలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర.. అలాగే చిన్న పిల్లలకు ICDS ఆధ్వర్యంలో ఉచిత పాల పంపిణీని కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగా చిన్న పిల్లల చేతులకు ట్యాగ్‌లు వేశారు. సముద్ర స్నానాలకు లక్ష నుంచి 2 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశముండటంతో.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సముద్రస్నానాలు కావడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే గజ ఈతగాళ్లను కూడా నియమించారు. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్రం ఒడ్డున దీపాలు వెలిగించడంతో ఆ కాంతుల్లో సముద్రతీరం వెలిగిపోయింది.