ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇకలేరు. వారసత్వంగా కంపెనీ బాధ్యతలు చేపట్టి వేల కోట్ల సంపదను.. లక్షల కోట్ల సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు రతన్ టాటా. అయితే.. ఆయన వ్యక్తిగత ఆస్తులు ఎంత అన్న ప్రశ్నకు సంబంధించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ పరిశీలిస్తే ఈ ఏడాది ఆగస్ట్ 20 నాటికి.. 403 బిలియన్ డాలర్లు అంటే.. 33న్నర లక్షల కోట్లుగా ఉంది. అది సరే.. మరి రతన్ టాటా సంపద ఎంత అంటే 2022 లెక్కల ప్రకారం కేవలం 3 వేల 800 కోట్లు మాత్రమే.
ఆశ్చర్యపోతున్నారా.. అయినా నిజంగా ఇదే నిజం. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రకారం చూస్తే రతన్ టాటా సంపద ఏమీ లేదు. ఇందుకు కారణం టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీలు టాటా ట్రస్ట్ కిందకు వస్తాయి. దీని హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్. ఈ సంస్థే తన మిగిలిన సంస్థల మొత్తం ఆదాయంలో 66 శాతాన్ని స్వచ్ఛంధ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది. ఇక, ఎంతో సేవా తత్పరత కలిగి ఉన్న రతన్ టాటా తన కంపెనీల నుంచి ఆదాయాలను స్వయంగా తీసుకోకుండా ట్రస్ట్ ద్వారా ప్రజల కోసం ఖర్చు చేశారు.


