దాదాపు రెండున్నరేళ్లకుపైగా యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌లోకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. పోలాండ్ నుంచి ఆయన బయల్దేరిన రైలు కీవ్‌కు చేరుకొంది. రైల్వేస్టేషన్ నుంచి ఆయన వాహన కాన్వాయ్ బయల్దేరి బస చేయనున్న ప్రదేశానికి వెళ్లింది.
పోలండ్‌లో నిన్న పర్యటన ముగించుకొన్న మోదీ రైలు మార్గంలో ఉక్రెయిన్‌కు బయల్దేరారు. ఆయన దాదాపు 10 గంటలు ప్రయాణించి కీవ్‌కు చేరుకొన్నారు. భారత్ ఏ పక్షం వహించదని.. కేవలం శాంతికి మాత్రం వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు. ఆయన పర్యటనలోని కార్యక్రమాల వివరాలు భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచారు.
దాదాపు ఏడు గంటలపాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. 1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.