అంతరిక్ష రంగంలో వందలకొద్దీ స్టార్టప్‌లు వచ్చాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాలు, రాకెట్లు ప్రయోగిస్తున్నారని చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగిందని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు మోదీ. మెడిసిన్ చదివేందుకు భారత యువత విదేశాలకు వెళ్తోందని.. గత పదేళ్లలో మెడికల్ సీట్లు లక్ష వరకూ పెంచామన్నారు మోదీ. రాబోయే పదేళ్లలో 75వేల మెడికల్ సీట్లను పెంచబోతున్నామని స్పష్టం చేశారు.
దేశంలో సమతౌల్యం దెబ్బతీయడానికి కొందరు ప్రతికూల ఆలోచనాధోరణి ఉన్నవారు యత్నిస్తున్నట్లు ప్రజలు అర్థం చేసుకోవాలని మోదీ ఆరోపించారు. వారసత్వం, కులతత్వం సమాజాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. ఈ రాజకీయాలను మనం వదిలించుకోవాలని మోదీ సూచించారు. మళ్లీ మళ్లీ ఎన్నికలు దేశాభివృద్ధికి మంచిది కాదని చెప్పారు మోదీ. వన్ నేషన్- వన్ ఎలక్షన్ దేశానికి చాలా అవసరమని స్పష్టం చేశారాయన. 2036లో ఒలింపిక్ క్రీడలను భారత్ నిర్వహిస్తోందని చెప్పారు ప్రధాని మోదీ. త్వరలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న కల సాకారమవుతుందన్నారు.