విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. రేపటి వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉండనుంది. నేడు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమం తర్వాత కార్పొరేటర్లు, కొందరు MPTCలను క్యాంప్‌నకు తరలించనున్నారు. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును చాలా రోజుల క్రితమే వైఎస్ జగన్ ఖరారు చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఆయన ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే అత్యధిక మంది ఓటర్లు వైసీపీ వైపు ఉన్నారు. దాదాపు 615 ఓటర్లు వైసీపీ వైపు ఉండగా, సుమారు 250 మంది వరకూ టీడీపీకి అనుకూల ఓటర్లున్నారు. దీంతో టీడీపీ ఇప్పటి వరకూ అభ్యర్థిని ఖరారు చేయలేదు. బొత్స సత్యనారాయణ ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అందరినీ బెంగళూరు క్యాంప్‌కు తరలించనున్నారు. ఇప్పటికే కొందరిని బెంగళూరుకు తరలించారు. ఆగస్టు 30వ తేదీన పోలింగ్ జరుగుతుండటంతో ఆరోజు క్యాంప్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకువచ్చే అవకాశముంది.
మరో వైపు.. ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. నామినేషన్లు దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగియనుండడంతో ఇవాళ అభ్యర్థిని ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నేతలతోనూ, మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ ఆయన చర్చించారు.


