బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ వంగాగీత హెచ్చరించారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని కొందరు ధ్వంసం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి వంగా గీత పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి, రోడ్డు ఇరువైపులా మానవహారం నిర్వహించారు. టీడీపీ అధికాంలోకి వచ్చినప్పటి నుంచీ విధ్వంసాలు పెరిగిపోతున్నాయని గీత ఆరోపించారు. అంబేద్కర్ స్మృతివనంలో జరిగిన దాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు వస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కక్షతోనే స్మృతివనంలో విధ్వంసం చేశారని గీత విమర్శించారు.


