ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనలో అరెస్టయిన నిందితుల సంఖ్య 7కు చేరింది. కోచింగ్ సెంటర్ ఓనర్, కోఆర్డినేటర్‌ను ఇదివరకే అరెస్టు చేశారు. వరద నీరు బిల్డింగ్ బేస్ మెంట్లోకి వెళ్లేలా నిర్లక్ష్యంగా కారును నడిపిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. అతని వాహనాన్ని సీజ్ చేశారు. నిందితులను పోలీసులు సోమవారం ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఢిల్లీ ఘటనపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రి, పగలూ అని తేడా లేకుండా స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రెండు వారాల కిందటే డ్రైనేజీ సమస్య ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే వరద ముంచెత్తిందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వరద ఒక్కసారిగా రావూస్ అకాడమీ భవన సెల్లార్‌ను ముంచెత్తింది. దీంతో ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక చనిపోయారు. కాసేపట్లోనే వరద నీరు ఏడు అడుగుల మేర సెల్లార్‌లో చేరిందని ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు.
రావూస్ స్టడీ సర్కిల్ దుర్ఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖ నిన్న ఒక కమిటీని నియమించింది. కమిటీలో హౌసింగ్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సీపీ, ఫైర్ అడ్వైజర్, జాయింట్ సెక్రటరీ ఉన్నారు. ప్రమాదానికి కారణాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ 30 రోజుల్లోపు నివేదిక ఇవ్వనుంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సివిల్స్ అభ్యర్థులు కోచింగ్ సెంటర్ వద్ద ధర్నా కొనసాగిస్తున్నారు. ఆప్ ఆఫీసు ముందు బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.