తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండల్లా మారడంతో.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతించింది. క్రమంగా వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటిమట్టం 47.3 అడుగుల వద్దకు చేరుకోగా.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
మరోపక్క ఏపీలోని పోలవరం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. అలాగే ధవళేశ్వరం వద్ద వరద ఉధృతితో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లంక గ్రామాలు జలయమం కావడంతో అక్కడి పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ఆరా తీస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆంధ్ర- ఒడిస్సా సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగుతోంది. 1.65లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో ప్రాజెక్టు నుంచి 41 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలం జలాశయం కూడా వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది. 1, 83 వేలకుపైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. మంగళవారం 842.4 అడుగుల నీటిమట్టం, 65.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఇప్పటికే కురిసిన వర్షాలతో జనం అల్లాడుతుంటే,.. మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. భారీ ఈదురు గాలులు, ఉరములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కిందకు వెళ్లరాదని సూచించారు.