అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకున్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు. రేపు లక్షలోపు రుణాల మొత్తం 6 వేల కోట్లకు పైగా జమ చేస్తామన్నారు. ఆగస్టు 15లోగా మిగతా లక్ష రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆగస్టు 15నాటికి రుణమాఫీని పూర్తి చేస్తామని మరోసారి చెప్పారు. ఇందుకు మొత్తం 31 వేల కోట్లు జమ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పామని… అందులో మొదటిసారి లక్ష చేస్తున్నామని అన్నారు.
రేపు 11.50 లక్షల మంది రైతులకు లక్ష రుణమాఫీ అవుతుందని చెప్పారు. రెండో దఫా ఆగస్టు 15 నాటికి మరో లక్ష బ్యాంకుల్లో జమ చేస్తామన్నారని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయశాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయని… నకిలీ పట్టా పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నవారిని గుర్తించామని చెప్పారు. లక్ష జీతం ఉన్నవాళ్లకు రుణమాఫీ కాదని… అలాంటి వారివి 17 వేల ఖాతాలున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు.