24.9 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి వరంగల్ లో ఉత్కంఠ

రేవంత్ కేబినెట్ లో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. మరొకరికి అవకాశం ఉంటే కడియంతో పాటు రేవూరి, నాయిని, దొంతిల్లో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కొండా సురేఖ, సీతక్కల శాఖలు మారుస్తారనే జరుగుతుండగానే మరోవైపు వారికి కీలక శాఖలు దక్కబోతున్నా యనే ప్రచారం జోరందుకుంటోంది. దీంతో రేవంత్ రెడ్డి మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది. ఇప్పటికే అమాత్యుల మార్పులు, చేర్పులు, కూర్పులపై కసరత్తు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలె ఢిల్లీ వెళ్లి మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చించి గ్రీన్ సిగ్నల్ తీసుకోవడంతో పాటు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే నేతలు, పాత మంత్రుల శాఖల మార్పులకు సంబంధించిన అంశాలతో కూడిన జాబితాను అందజేశారు. దీంతో మంత్రివర్గంలో ఓరుగల్లుకు మరో బెర్త్ దక్కబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రిపదవి కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మహిళలు రేవంత్ టీంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా మరోకరికి అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుత మంత్రుల్లో కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం, సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎస్సీ, జనరల్ కోటా నుంచి కేబినెట్ లో చోటుకోసం పలువురు శాసన సభ్యులు ప్రయత్నిస్తు న్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనరల్ కోటాలో వరంగల్ పశ్చిమ, పరకాల, నర్సంపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేంద్రరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు అసంతృప్తిగా ఉన్న దొంతి మాధవరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్నివిస్తరించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఓరుగల్లు ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆరుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ నుంచి 10మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ ఎస్ నుంచి గెలిచిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మినహా మిగతా 11మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు చెందినవారే ఉన్నారు. గత డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తర్వలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఓరుగల్లుకు మరో బెర్త్ దక్కుతుందనే సమాచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక లెక్కలు తెరపైకి వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గంతోపాటు జనరల్ కోటా నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

గతంలో ఉప ముఖ్యమంత్రిగా, సాంఘిక, సంక్షేమశాఖగా, విద్యాశాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. తన కుమార్తెను ఎంపీగా కూడా గెలిపిచుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరికి అధిష్టానం మంచి గుర్తింపునిస్తోంది. ఈ క్రమంలోనే కడియంను కెబినేట్ లోకి తీసుకోవటం ద్వారా తన మంత్రివర్గం బలోపేతం అవుతుందన్న భావనలో సీఎం ఉన్నారనే చర్చ జరుగుతోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన పాతికేళ్లకు పైగా కాంగ్రెస్ కు సేవలు అందిస్తున్నారు. బీఆర్ఎస్ హయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని కాపాడుకున్నారనే పేరుంది. దీనికితోడు సీఎం రేవంత్ రెడ్డితో మంచి సత్సంబంధాలు ఉండటంతో వరంగల్ కు మరో మంత్రి పదవి వచ్చే అవకాశముందనే చర్చ సాగుతోంది.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి కూడా కొత్త మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. నర్సంపేట నియోజకవ ర్గం నుంచి 1994, 1999, 2009లో 3 పర్యా యాలు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో కాంగ్రెస్ లో చేరిన మూడు నెలలోనే పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డికి సామాజిక వర్గ సమీకరణలతో ఒక్కసారి కూడా మంత్రివి దక్కలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధంతో ఈసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో రేవూరి అనుచరులున్నారు.

ఇక ఈ ముగ్గురితో పాటు 2014, 2023లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు మాధవ రెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు సీఎంతో సఖ్యత లేదన్న ప్రచారం కూడా దొంతి మాధవరెడ్డికి ఇబ్బంది కలిగించే అంశం. తొలిసారి గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సీనియర్ నేత అయినప్పటికి సామాజిక సమీకరణలో మంత్రి పదవి దక్కు తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వసినిరెడ్డి తొలిసారి గెలవడంతో పాటు రాజకీయాలకు కొత్త కావడంతో ఆమెకు అవకాశం ఉండకపోవచ్చనే వార్తలు చక్కర్లు కొడుతు న్నాయి. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కు విప్ గా బాధ్యతలు అప్పగించడం, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ తొలిసారి ఎమ్మెల్యే కావడమే కాకుండా సామాజిక సమీకరణలు కలిసి రాకపోవచ్చనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిశాఖ, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు హోం శాఖ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో నక్సలిజంలో పని చేసిన సీతక్కకు హోంశాఖ కేటాయిస్తారనే ప్రచారం ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమెకు హోం శాఖమంత్రి పదవి ఇస్తే ఉమ్మడి వరంగల్ చరిత్రలోనే గిరిజన మహిళకు హోంశాఖ ఇవ్వడం తొలిసారి అవుతుంది. అలాగే మరో మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం దేవాదాయ శాఖతో పాటు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సురేఖ సమర్థతకు ఈ రెండు శాఖలు సరిపోవటం లేదనే చర్చ నేపథ్యంలో ఆమెకు విద్యాశాఖ లేదా రెవెన్యూ శాఖల్లో ఏదైనా ఒకటి అప్పగించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గం విస్తరణతో పాటు మంత్రుల శాఖల మార్పుపై చేస్తున్న కసరత్తు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్కంఠను రేపుతోంది. నలుగురిలో మంత్రి పదవి ఎవరిని వరించబోతుందోనని ఆసక్తి పెరుగుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్