ఆరుద్ర కార్తె వచ్చిందంటే అన్నదాతల్లో ఆనందం పెల్లుబుకుతుంది. పర్యావరణ నేస్తాలుగా పేరొందిన అరుదైన ఆరుద్ర పురుగులు ఈ మాసంలోనే దర్శనమిస్తాయి. ఆరుద్ర కార్తెలో తొలకరి జల్లులు కురిసిన ప్పుడు పంట పొలాలపైన, నేలపై న హరిత శోభతో ఈ అందమైన పురుగులు దర్శనమిస్తాయి. ఆరుద్ర పురుగులు అధికంగా కనిపిస్తే ఆ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతన్నలు విశ్వసిస్తారు. అయితే, అందాల ఆరుద్రను భావితరాలు వీక్షించే భాగ్యం ఉందా.? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆరుద్ర కార్తె లోని ఆరుద్ర పురుగుపై ప్రత్యేక కథనం.
సృష్టిలో ఎనభై అయిదు లక్షల జీవరాశులు ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఈ ధరణిపై ఎన్నో కోట్ల ప్రాణులు నివసిస్తున్నాయి. జంతువులు, పక్షులు, పురుగులు, కీటకాలు ఉన్న ఈ భూగోళంపై కొన్ని అరు దైన జీవులు సైతం ఉన్నాయి. కొన్ని పురుగులైతే కొన్ని ప్రత్యేక సీజన్లలోనే కనిపిస్తాయి. అయితే, ఆరుద్ర పురుగు కేవలం కొన్ని రోజులే కనిపించి మళ్ళీ కనుమరుగు అవుతుంది. ఏడాదిలో ఒకసారి మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఆరుద్ర కార్తె సమయంలో ఈ పురుగులు సందడి చేస్తాయి. ఎర్రగా బుర్రగా బొద్దుగా అందంగా ఉండే ఆరుద్రలు మొఖమల్ క్లాత్ ను చుట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ ఆరుద్రను రెడ్ వెల్వెట్ గా పిలుస్తారు. ఆరుద్ర కార్తె సమయంలో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. రైతులకు మేలు చేసే జీవులుగా వీటిని భావిస్తారు. ఇవి ఎక్కువగా కనిపి స్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతుల నమ్మకం. దున్నిన నేలల్లోని చీడ పురుగులు లార్వాలను తిని రైతుకు ఇవి మేలు చేస్తాయి. ఇవి కనిపిస్తే చాలు రైతులు తెగ సంతోషపడిపోతారు. అయితే, ఆరుద్ర పురుగులు మునుపటింతా ఎక్కువగా కనిపిం చడం లేదు. ఇప్పుడుక్రిమి సంహారక మందులు, రసాయన ఎరువుల వాడకంతో ఇవి అంతరించి పోతున్నాయని వ్యవసాయ, భౌతిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చిన్నా, పెద్దా అందరూ ఇష్టపడే ఆరుద్ర పై కొన్ని నానుడులు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి. ఆరుద్ర లో వానలు కురిస్తే అంతా శుభకరమని, పుష్కలంగా పంటలు పండుతాయని రైతన్నలు తెలియజేస్తు న్నారు. జూన్ నెలలో వచ్చే రెండో కార్తె ఆరుద్ర కార్తె. ఆరుద్ర కార్తెలో కనిపించే ఈ పురుగును, ఇప్పుడు తిలకించలేకపోతే వచ్చే ఆరుద్ర కార్తె వరకు ఆగితీరాల్సిందే అని అన్నదాతలు తెలియజే స్తున్నారు.