– చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా
– బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది? అప్పుడెప్పుడో ఇచ్చేసినా ఈ పిచ్చిమాలోకాలు ఇంకా తెలుసుకోకుండా.. ఇప్పటికీ మాకు ప్రత్యేక హోదా కావాలి.. కావాలి.. అని గొంతుచించుకుంటున్నారా పాపం! బహుశా ప్రత్యేక హోదాను ఆర్డినరీ పోస్టులో పంపి ఉంటారు. అలటాటులో పొరపాటుగా సెక్రటేరియేట్ సొరుగుల్లో అది ఏ మూలో పడిపోయి ఉంటుంది. కాస్త వెతకండ్రా బాబూ’’!
ఏపీకి ప్రత్యేక హోదా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన తర్వాత.. సోషల్ మీడియాలో వరదల్లా పొంగి ప్రవహిస్తున్న సెటైర్లు ఇవి.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడే, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేశామని వీర్రాజు ప్రకటించారు. దానికి సంబంధించి, చంద్రబాబు 15 వేల కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఎమ్మిగనూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాజాగా రాజ్యసభలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా, ప్రత్యేక హోదా గురించి గళమెత్తారు. బీజేపీ చెబుతున్నట్లు అది ముగిసిపోయిన అధ్యాయం కాదని, చరిత్ర అంతకంటే కాదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం, వైసీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతుందని వెల్లడించారు.
దానితో సహజంగా మళ్లీ ప్రత్యేక హోదాపై అలజడి మొదలయింది. ఇప్పటివరకూ హోదా అంశంపై టీడీపీ ఒక్కటే గళమెత్తుతోంది. జగన్ ప్రధానిని కలిసినప్పుడు, హోదా గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తోంది. మొత్తం ఎంపీలను ఇస్తే, కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామన్న జగన్ హామీని టీడీపీ ఇప్పటికీ గుర్తు చేస్తూ, ఆ పార్టీని ఇరుకున పెడుతోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మీడియా సాక్షిగా చేసిన ప్రకటన చర్చనీయాంశమయింది. సొషల్‌మీడియాలో వీర్రాజు ప్రకటన తెగ నవ్వులు కురిపిస్తోంది. ఎప్పుడో హోదా ఇచ్చేశామన్న వీర్రాజు వ్యాఖ్యలపై ‘ అదెక్కడుందో వెతికిపెట్టండ్రా బాబూ’.. ‘ఇచ్చినా కూడా ఇంకా హోదా అడుగుతారేంటి?’… ‘ ఒకసారికే దిక్కులేదు. రెండుసార్లు హోదా ఇస్తారా ఏంటి?’.. ‘ ఆ మాత్రం కూడా చూసుకోకుండా పార్లమెంటుకు వెళితే ఎలా?’… ‘చంద్రబాబుకు 15 వేల కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చారా? చెక్కులిచ్చారా’?… ‘బహుశా గూగుల్ పే చేసినట్లుంది. బ్యాంకు సర్వర్ ప్రాబ్లెమ్ వల్ల ఇంకా అకౌంట్‌లో పడనట్లుంది’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.‘ హోదా పోస్టల్‌లో కాకుండా, కొరియర్‌లో పంపిస్తే ఈపాటికి అంది ఉండేది కదా’?..‘ సర్లెండి వీర్రాజు గారూ.. ఒరిజినల్ కాపీ ఎక్కడో పోయింటది. మా తింగరోళ్లు ఎక్కడో పడేసి ఉంటారు. ఆ ఒరిజినల్ కాపీ ఏదో మీరే కాస్త సంపాదించి పెట్టండి’ అని ఇంకొందరు తెగ ఎకసెక్కాలాడుతున్నారు.
బహుశా ఏపీకి హోదా బదులు, ప్యాకేజీ ఇచ్చారనడం వీర్రాజు కవి హృదయం కావచ్చని బీజేపీ నేతలు దిద్దుబాటుకు దిగారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ప్యాకేజీ ఇచ్చారన్నదే వీర్రాజు అభిప్రాయం కావచ్చని.. కానీ ఆయన సహజ ప్రసంగ ధోరణి వల్ల, అలా తప్పులు దొర్లి ఉండవచ్చన్నది కమలదళాల ఉవాచ.