ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరనున్నారు సీబీఐ అధికారు లు. అయితే న్యాయస్థానం మరోసారి కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశముంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలోనే ఈడీ అధికారుల బృందం ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు ముందుగా ఈడీ అధికారులు బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు నాలుగైదు గంటల పాటు సోదాల అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఈడీ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉన్నారు. రెండు దఫాలుగా పది రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడీషియల్ కస్టడీ ని కోర్టు పొడిగిస్తూ వచ్చింది. తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత సీబీఐ కేసులోనూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈడీ, సీబీఐల అరెస్ట్ లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇక ఇవాళ్టితో కవిత కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి..? మరోసారి కోర్టు ముందుకు కవిత రానున్న తరుణంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.