25.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

ఏపీ ,తెలంగాణల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయా?

  ఏపీ, తెలంగాణ మధ్య మైత్రీ బంధం మరింతగా పెరగబోతోందా? ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో అందరిలోనూ ఇవే అంచనాలు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ కాల్ చేయడంతో సరికొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇరువురు ముఖ్య మంత్రులు పరస్పర సహకారం అందించుకొని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికే ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాల్‌ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో రెండు రాష్ట్రాల మధ్య దాదాపుగా పదేళ్ల నుంచి అపరిష్కృ తంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  నిజానికి గతేడాది తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండడం తో పెద్దగా సఖ్యత లేకుండా పోయిందన్న వాదన విన్పించింది. అదే సమయంలో స్వయంగా ఓ ఇంటర్వూలోనూ తనకు కనీసం జగన్ శుభాకాంక్షలు సైతం చెప్పలేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంత సత్సంబంధాలు లేవన్న మాట బహిరంగంగానే విన్పించింది. కానీ, మారిన పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. పైగా గతంలో తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్ర పడ్డారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారినా ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానం అని చెబుతుంటారు రేవంత్ రెడ్డి. అటు చంద్రబాబు, ఇటు రేవంత్ మధ్య ఉన్న ఈ స్నేహబంధమే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ కొత్త ఆశలు రేపుతోంది. పైగా తెలంగాణలో అధికారంలోకి రాకముందు, వచ్చిన కొత్తలోనే పలు కీలక అంశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు నాగార్జున సాగర్‌పైకి ఏపీ పోలీసులు రావడాన్ని తప్పుపట్టిన ఆయన నాటి కేసీఆర్ సర్కారు ఏం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఇక, అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు రేవంత్ రెడ్డి. ప్రగతిభవన్‌లో జగన్‌కు పంచ భక్ష్య పరవాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్‌లోనే పునాదిరాయి పడిందంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు. మంత్రి రోజా పెట్టిన రాగి సంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇలా పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.

   ఇటీవల ఏపీలో ప్రభుత్వం మారడం, పైగా చంద్రబాబు, రేవంత్‌ ఇరువురి మధ్యా గురుశిష్యులుగా పిలుచుకునే అనుబంధం ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పై పడింది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూలు 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తికాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి. ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను తొమ్మిదవ షెడ్యూల్‌లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. పదో షెడ్యూల్‌ లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధనా సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా భిడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూలు 9, 10 సంస్థల విభజనపై సిఫా ర్సులు చేసినా ఇప్పటికీ అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా ఒకటీ రెండూ కాదు రెండు రాష్ట్రాల మధ్యా ఇంకా పూర్తికాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడడం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్న చర్యలు ఉంటాయని ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుతు న్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్