లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పూర్తి స్థాయి కేంద్ర మంత్రి మండలితోనూ ప్రధాని భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరిగా కేబినెట్, మంత్రిమండలి సమావేశం అయింది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రస్తుత లోక్‌సభ రద్దుకు కేబినెట్ సిఫార్సు చేయనుంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 242 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 99 స్థానాలతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 292 స్థానాలు రాగా.., ఇండియా కూటమికి 234 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిజర్ 272ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.


