లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటకపోవడంతో విపక్ష ఇండియా కూటమిలోనూ అధికారంపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో ఏ కూటమి అందలం ఎక్కాలన్నా ఎన్డీయే పక్షాలైన టీడీపీ, జేడీయూలు కీలకంగా మారాయి. దీంతో ఈ పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు విపక్ష ఇండియా కూటమి కసరత్తు సాగిస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ టీడీపీ, జేడీయూ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీ అధినేత చంద్రబాబు, బిహార్ సీఎం నితీష్ కుమార్‌తో టచ్‌లో లేనని ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు వారితో మాట్లాడలేదని చెప్పారు. ఇండియా కూటమి భేటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత తాను వారితో మాట్లాడతానని తెలిపారు. ఇప్పటివరకూ మాత్రం వారితో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు.


