ఖమ్మంలో హస్తం హవా ప్రభంజనం సృష్టించింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ ఓట్ల సునామీలో కారు బోల్తా పడగా,.. కమలం వాడింది. ఖమ్మం గుమ్మలో ఎన్నడూ కనివిని ఎరుగుని రీతిలో 4.67 లక్షలకుపైగా భారీ మెజార్టీతో విజయపతకాం ఎగురవేసి రికార్డ్ మోత మోగించింది. ఇంతకీ ఆ విజయానికి కారణాలేంటి..? హస్తం హవా ప్రభంజనపు ముచ్చటేంటి..? తెలుసుకుందాం.
ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో హస్తం సునామీ సృష్టించింది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4 లక్షల 67 వేల 847 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. లోక్‌సభ స్థానం చరిత్రలో రికార్డ్ మోత మోగించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే అత్యధిక మెజార్టీని సాధించి ఓట్లు సునామీతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి.. ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మూడో స్థానంలో నిలిచారు.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన స్థానాల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి 5 లక్షలకు మెజార్టీ మార్క్‌ను దాటి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. 4 లక్షలకుపైగా ఓట్లు సాధించి రఘురాంరెడ్డి సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఇక ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యత కనబరిచారు రఘురాంరెడ్డి. మొత్తం 7 లక్షల 66 వేల 929 ఓట్లను సాధించారు. తనకు పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావుకు 2 లక్షల 99 వేల 82 ఓట్లు రాగా,.. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదావుకు లక్షా 18 వేల 636 ఓట్లు పోలయ్యాయి. ఒకటో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి 20 వేలకు పైగా మెజార్టీ రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపో యారు. అత్యధికంగా 11వ రౌండ్లో కాం గ్రెస్ అభ్యర్థికి 45 వేల 260 ఓట్లు రాగా, బీఆర్ ఎస్ అభ్యర్థికి 17 వేల 407 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 4వ రౌండ్లో కాంగ్రెస్‌కు 42 వేల 919 ఓట్లు, బీఆర్ఎస్‌కు 16 వేల 630 ఓట్లు వచ్చాయి. అలాగే. 3వ రౌండ్లో కాంగ్రెస్‌కు 42 వేల 336 ఓట్లు, బీఆర్ఎస్‌కు 18 వేల 206 ఓట్లు పోలయ్యాయి. చివరకు 3 లక్షల మెజార్టీ దాటుతుందనే అంచనాలను కూడా కాంగ్రెస్ అభ్యర్థి అధిగమించడంతో ఏ రౌండ్‌లో కూడా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ప్రతీ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ పెరుగుతుండడంతో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సైతం లెక్కింపు పూర్తికాకుండానే వెళ్లిపోయారు.
పోస్టల్ బ్యాలేట్‌లోనూ కాంగ్రెస్‌కు భారీగానే ఓట్లు పోలయ్యాయి. మొత్తం 11 వేల 151 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను 300 ఓట్లను తిరస్కరించారు. మిగిలిన వాటిలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి 7 వేల 326 ఓట్లు, బీజేపీ అభ్య ర్థి తాండ్ర వినోదారావుకు ఒక వేయి 561, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఒక వేయి 490 ఓట్లు వచ్చాయి. అయితే పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. నోటాకు సైతం 125 ఓట్లు పోలవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థికి 5 వేల 765 ఓట్ల మెజార్టీ దక్కింది
ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఏ రౌండ్‌లోనూ బీఆర్‌ఎస్ ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 12 లక్షల 40 వేల 582 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి 2 లక్షల 99 వేల 82 ఓట్లు మాత్రమే సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 5 లక్షల 67 వేల 459 ఓట్లు పోల్ కాగా 49.80 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి కేవలం 24.10 శాతం ఓట్లు సాధించి ఓటమి చవిచూశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినా తక్కువ శాతం ఓట్లు పోలవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మొత్తం లక్షా 18 వేల 636 ఓట్లు పొందారు. 2019 పార్ల మెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 20 వేల 488 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో 1.80 శాతం పోల్ కాగా.. ఈసారి 9.55 శాతానికి పెరగడం విశేషం. తొలి నుంచి విస్తృతంగా ప్రచారం చేయడంతో బీజేపీ అభ్యర్థి వినోద్ రావుకు లక్ష ఓట్లకు పైగా పోలైనా ఏ రౌండ్‌లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు. అయితే ఓటింగ్ శాతం పెంచుకోవడమే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం.
ఇలా మొత్తానికి ఖమ్మం గుమ్మంలో ప్రభంజనం సృష్టించి కాంగ్రెస్ పార్టీ. హోరాహోరీగా సాగిన త్రిముఖ పోరులో అత్యధిక మెజార్టీ సాధించి హస్తం హవా ఏంటో చూపించింది. బీఆర్‌ఎస్, బీజేపీలను మట్టికరిపించి కాంగ్రెస్ జెండా రెపరెపలాడించింది.


