ఏపీలో కూటమి పార్టీలు సునామి సృష్టించాయి. సైకిల్ స్పీడ్‌కి ఫ్యాన్ కుదేలైంది. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని చవిచూసిన వైసీపీ ఐదేళ్లు తిరిగేసరికి ఘోర పరావభవం పాలైంది. మంత్రులు కూడా ఓటమిపాలయ్యారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి విజయ ఢంకా మోగించాయి కూటమి పార్టీలు. దీంతో తెలుగు తమ్ముళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. టపాకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫుల్ సెలబ్రేషన్లలో మునిగి పోయారు.
ఇక ఏపీ లోక్‌సభ స్థానాల్లో కేవలం 4 స్థానాలు మినహా అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ప్రత్యర్థి వైసీపీ క్యాండిడేట్లను మట్టి కరిపించారు. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మెహన్ నాయుడు విక్టరీ కొట్టారు. వైసీపీ క్యాండిడేట్ పేరాడ తిలప్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనకాపల్లి సీటును బీజేపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడిపై సీఎం రమేష్ గెలుపొందారు. అలాగే అమలాపురంలోనూ టీడీపీ గెలుపొంది సైకిల్ సత్తా చాటింది. వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌రావుపై తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ విజయం సాధించారు.
రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి 2 లక్షలకుపైగా భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేసిన గూడూరి శ్రీనివాసులును ఓడించారు. విజయవాడ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని తన సోదరుడు, ప్రత్యర్థి కేశినేని నానిపై గెలుపొందారు. అలాగే గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని భారీ మెజార్టీతో గెలిచి వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోషయ్యను మట్టి కరిపించారు. నరసాపురం నుంచి బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ భారీ మెజార్టీతో గెలు పొందారు. కాకినాడ లోక్‌సభ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్, విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు వైసీపీని ఓడించి విక్టరీ కొట్టారు. నెల్లూరు నుంచి టీడీపీ క్యాండిడేట్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై గెలుపొందారు.
చిత్తూరులోనూ సైకిల్ స్పీడ్‌కి ఫ్యాన్ చతికిలబడింది. వైసీపీ క్యాండిడేట్ రెడ్డప్పపై టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్‌రావు గెలుపొందారు. అలాగే నరసరావుపేటలో పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌పై టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థి బాలశౌరి, ఏలూరులో టీడీపీ క్యాండిడేట్ మహేష్‌కుమార్ గెలుపొందారు. అనంతపురంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ విక్టరీ కొట్టారు. అలాగే హిందూపురం, ఒంగోలులో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిం చారు. విశాఖలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీపై టీడీపీ అభ్యర్థి మతుకుమిల్లి భరత్ గెలుపొందారు. బాపట్ల, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాల్లోనూ సైకిల్ జోరు సాగింది. భారీ మెజార్టీతో బాపట్ల నుంచి కృష్ణ ప్రసాద్, కర్నూలులో నాగార్జున, నంద్యాలలో బైరెడ్డి శబరి గెలుపొందారు. ఇకపోతే కడప, రాజంపేట, అరకు, తిరుపతిలో మాత్రమే ఫ్యాన్ గాలి వీచింది.


