ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో దాదాపు 90 శాతం స్థానాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ ఏపీ ప్రజాతీర్పు స్పష్టం కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. నారా చంద్రబాబు భువనేశ్వరీ దంపతులు హర్షం వ్యక్తంచేస్తూ.. కేక్ కట్ చేశారు. అంతేకాకుండా.. నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ కూడా కేక్ ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఏపీలో 144చోట్ల టీడీపీ పోటీ చేసిన టీడీపీ136స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన, 20 నియోజకవర్గాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. పాలకొండలో జనసేన, వైసీపీ మధ్య హోరాహోరీ నెలకొంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విజయం సాధించారు. తణుకు వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరావుపై టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ 71 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాడేపల్లిగూడెంలో జనసేన జయకేతనం ఎగుర వేసింది. వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై బొలిశెట్టి శ్రీనివాస్ 61 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్ విజయం సాధించారు. అనంతపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 20 వేల 879 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పులివెందులో జగన్ 69 169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కమలాపురంలో జగన్ మేనమామ, వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20 వేల 937 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక, కడప స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి ఆంజాద్ భాషాపై విజయం సాధించారు. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. 14 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే 16 ఎంపీ స్థానాల్లో తెలుగు దేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. 3చోట్ల బీజేపీ, రెండు చోట్ల జనసేన ఆధిక్యంలో ఉంది. ఇక కేవలం నాలుగు ఎంపీ స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్ కొనసాగుతోంది.


