ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో మే నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ యా లేక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్, జగన్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి.
ఆత్మసాక్షి సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు విజయం చేకూర్చనున్నారు. ఎన్నికలకు ముందు నుంచే వైనాట్ 175 అంటూ మెజార్టీ స్థానా లు కైవసం చేసుకోవడంపై జగన్మో హన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 116 నియోజకవర్గాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. కాగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి 59 నుంచి 77 సీట్లు గెలుచుకుంటుందని ఆత్మసాక్షి సంస్థ స్పష్టం చేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హవా కొనసాగినట్లు ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 16, తెలుగు దేశం పార్టీ ఆరు, జనసేన ఒక సీటు, బీజేపీ ఒక సీటు అలాగే ఇతరులు ఓ నియోజకవర్గం గెలుచుకుం టాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అంటే టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది ఆత్మసాక్షి సంస్థ. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయమని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఐదేళ్ల పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్పష్టంగా తీర్పునిచ్చారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి 95 నుంచి 110 సీట్లు వస్తాయని ప్రకటించింది. అలాగే జనసేనకు 14 నుంచి 20 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా భారతీయ జనతా పార్టీకి రెండు నుంచి ఐదు సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. అంటే మొత్తం 175 సీట్లలో కూటమికి 111 నుంచి 135 సీట్ల వరకు వస్తాయన్నది పీపుల్స్ పల్స్ అంచనా.
ఇదిలా ఉంటే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని తేల్చి చెప్పాయి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్. జగన్ పార్టీకి 45 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయని తమ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ప్రకటించింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాల అమలు తప్ప పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడం, ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి సర్కారు విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఈసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అలాగే జనసేనకు రెండు, బీజేపీకి రెండు నుంచి నాలుగు లోక్‌సభ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మూడు నుంచి ఐదు మాత్రమే ఎంపీ సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది పీపుల్స్ పల్స్ సంస్థ. కాగా స్వతంత్ర పయనీర్ సంస్థ జరిపిన సర్వేలో ఓటర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయని స్వతంత్ర పయనీర్ సర్వే ప్రకారం తెలుస్తోంది. స్వతంత్ర పయనీర్ సర్వేలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 95 నుంచి 105 సీట్లు వస్తాయని తేలింది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 70 నుంచి 80 సీట్లు సాధించే అవకాశం ఉందని స్వతంత్ర పయనీర్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
రేస్ ఎగ్జిట్ పోల్స్ అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ కట్టబెట్టింది. 122 నుంచి 127 స్థానాల్లో జగన్ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. తిరుగులేని మెజార్టీతో మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందని పేర్కొన్నాయి రేస్ ఎగ్జిట్ పోల్స్. కాగా టీడీపీ నాయక త్వంలోని కూటమికి 53 నుంచి 58 స్థానాలు వస్తాయని రేస్ సంస్థ పేర్కొంది. టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేసినా పరాజయం తప్పదని తేల్చి చెప్పాయి రేస్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్. అలాగే పోల్స్ మైండ్స్ ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హవా స్పష్టంగా కన్పించింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 116 నుంచి 134 సీట్లు వస్తాయని లెక్కలేసింది. ఇక, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 47 నుంచి 65 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. కాగా లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 16 నుంచి 20 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది పోల్స్ మైండ్స్ ఎగ్జిట్ పోల్స్. తెలుగుదేశం పార్టీ కూటమికి నాలుగు నుంచి ఐదు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని పోల్స్ మైండ్స్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
ఫస్ట్ స్టెప్ ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ దే విజయమని తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 114 నుంచి 124 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాగా టీడీపీ నాయకత్వంలోని కూటమికి 50 నుంచి 62 సీట్లు దక్కవచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇక లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కు 17 నుంచి 20 సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే టీడీపీ కూటమికి ఐదు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సునీల్ వీర్ అండ్ టీమ్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హవా స్పష్టంగా కన్పించింది. దాదాపు 92 సీట్లలో జగన్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రకటించింది. టీడీపీ కూటమికి 79 సీట్ల వరకు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ జగన్ పార్టీదే పైచేయి అని తేల్చింది సునీల్ వీర్ అండ్ టీమ్. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 15 నుంచి 17 ఎంపీ సీట్లు వస్తాయంది. కాగా తెలుగుదేశం పార్టీకి ఆరు నుంచి ఏడు సీట్లు దక్కవచ్చని పేర్కొంది. పొలిటికల్ లేబరేటరీ ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హవా వీచింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 108 నుంచి 113 స్థానాలు వస్తాయని తేల్చింది. టీడీపీ కూటమికి 67 నుంచి 72 స్థానాలు దక్కవచ్చని పేర్కొంది. మొత్తంగా చూస్తే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారం అని తేల్చిచెప్పాయి.