పారిశ్రామిక ప్రగతి లేక వికారాబాద్ జిల్లా యువత నిరుద్యోగ సమస్యతో అల్లాడుతోంది. నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చొరవ చూపినా, అనుకున్న స్థాయిలో కార్యాచరణ జరగలేదనే విమర్శలు ఉన్నాయి. నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వీటిపై దృష్టి సారిస్తారని నిరుద్యోగ యువత ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
పదేళ్ల క్రితం అప్పటి పాలకుల నోట వినిపించిన మాట పరిగిలో పారిశ్రామికవాడ దశాబ్ద కాలం అనంతరం ఎన్నో మార్పులు. రాష్ట్ర అవతరణ అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఆ సర్కారు హయాంలో పాత మాటగా మారిన పరిగి పారిశ్రామికవాడ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పాలనా పగ్గాలు హస్తం పార్టీ హస్తగతం అవ్వడంతో నిరుద్యోగుల్లో చిరు ఆశలు రేకెత్తాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల, పూడూరు పంచాయతీల పరిధిలో పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాకంచర్ల, పూడూర్ గ్రామ పంచాయతీలోని 5/1, 243/1, 244/1, 245/1 246/1, 247/1, 248/1 సర్వే నంబర్లలో ఉన్న 112.48 ఎకరాల పేదల భూములను ఇందు కోసం గుర్తించి వారికి పరిహారం అందించారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి NH 163 కలిగి ఉండడంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణా సౌకర్యం అనుకూలంగా ఉంటుందని భావించారు. దీంతో 2014 లో అధికారులు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ భూములను పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఏపీఐఐసీకు అప్పగించింది. ఈ సమీపంలోనే జాతీయ రహదారి, మిషన్ భగీరథ ప్లాంటు, సోలార్ పవర్ ప్లాంట్, పవన విద్యుత్తు వంటివి అనుకూలంగా ఉన్నాయి. గతం మాట ఎలా ఉన్నా, ప్రస్తుత పాలకులైనా దీనిపై దృష్టి సారిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుందన్న ఆశాభావం సర్వత్ర వ్యక్త మవుతోంది.
వ్యవసాయ ప్రధాన జీవనాధారంగా ఉన్న పరిగి నియోజకవర్గంలో పారిశ్రామికవాడ ఏర్పాటు ఎంతో శుభ పరిణామమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అప్పట్లో 798 లక్షల 50 వేల రూపాయల నిధులతో నీటి సదుపాయం, రెండు వరుసల బీటీ రోడ్లు, విద్యుత్ తదితర సౌకర్యాలను పూర్తి చేశారు. వేర్వేరుగా ప్లాట్లు చేసి సీరియల్ నంబర్లు వేసి ఉంచారు. మొత్తం 38 పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉందని అధికారులు గుర్తించారు. ప్రారంభంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందు కు రాకపోవటంతో కేవలం ఆరు పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అయితే, నాలుగు పరిశ్రమలు మాత్రమే కొనసాగుతున్నా యి. వాటిలో స్థాని కులకు పదుల సంఖ్యలో మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయి. చాలా కాలంగా ఈ స్థలం ఖాళీగానే కనిపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావడంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
హైదరాబాద్ శివారు కాటేదాన్ ప్రాంతంలో కొనసాగుతున్న వివిధ పరిశ్రమలను రాకంచర్లకు తరలించాలని గత ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి టీఎస్ఐఐఐసీ చైర్మన్ బాల మల్లు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ఆ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి పారిశ్రామిక వాడను పరిశీలించారు. నగరంలోని కాటేదాన్ ప్రాంతంలో ఐరన్ పరిశ్రమలను తొలగింపజేయించి రాకంచర్లకు తరలించే విధంగా ఆరు నెలలు గడువు విధించారు. పట్టించుకోకుంటే అనుమతులు రద్దు చేసి జనరల్ కేటగిరి కింద ఇతర సంస్థలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, రెండేళ్లు దాటినా అడుగు ముందుకు పడలేదు. ఇప్పటివరకు రాని పరిశ్రమల భూ అనుమతులను రద్దు చేసి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కాలుష్యం లేని పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు రైతు అభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాలుష్య రహిత పర్యావరణంతో పాటు జిల్లాలో రైతులు పండించే పంటలతో వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభ్యం అవుతాయని అంటున్నారు. రైతులకు సైతం లబ్ది చేకూరుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతిపైనా పాలకులు దృష్టి సారించాలని నిరుద్యోగులు వేడుకొంటున్నారు.


