తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందడి ముగిసింది. ఇక, త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ల హడావిడి ప్రారంభం కానుంది. దీంతో జూన్ నాలుగు తర్వాత అన్ని పార్టీలూ స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టనున్నాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి ముగిసింది. జూన్ నాలుగున ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీ పైచేయి సాధించింది. ఏ పార్టీ ఎంపీ ఎన్నికల్లో విఫలమైంది అన్నది అతి త్వరలోనే తేలిపోనుంది. మొత్తంగా ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కావడంతో ఇక రాజకీయ పార్టీల దృష్టి త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పైకి మళ్లింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానిక నేతలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు స్థానిక పార్టీ శ్రేణులకు లోకల్ ఎలక్షన్లలో అవకాశాలిస్తామని హామీలిచ్చాయి. దీంతో పలువురు ఆశావహులు సిద్ధమవుతు న్నారు. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే సన్నద్ధమవుతోంది. వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు సంబంధించి ఆయా స్థానాల వారీగా రిజర్వేషన్ల వివరాలను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా సేకరించింది. పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. బ్యాలెట్ బాక్సుల్ని సైతం సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు పూర్తికావడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎన్నికల నిర్వహణకు ముందుగా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. జూన్ నాలుగు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే బీసీ కమిషన్ రెండు మూడు నెలల్లో అభిప్రాయ సేకరణ, ఇంటింటి సర్వే నిర్వహించినివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత సంబంధిత రిపోర్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి, రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజే స్తుంది. దాని ఆధారంగా ఎన్నికలు జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ భారీ ప్రక్రియేనని చెప్పాలి. తెలంగాణలో మొత్తం 12 వేల 814 గ్రామ పంచాయతీలు, 88 వేల 682 వార్డులున్నాయి. 620 జడ్పీటీసీ స్థానాలు, 6473 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అయితే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుపుతారు.హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి. ఉప సర్పంచులకు పరోక్ష ఎన్నికలు ఉంటాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జులై 3న ముగియనుంది. దీంతో ఆలోపు ఎన్నికలు పూర్తి చేస్తే కొత్త సభ్యులు, పాలక వర్గాలు బాధ్యతలు చేపడతాయి. అప్పటిలోగా ఎన్నికలు జరగకపోతే మండల, జిల్లా పరిషత్‌లకు సైతం ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుంది.