ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కొత్త రకం ప్రచారానికి తెరలేపారు. నేను లోకల్ అంటే, నేను పక్కాలోకల్ అని బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు , కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రత్యర్థి నాన్ లోకల్ అంటూ ఎద్దేవా చేసుకుంటున్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో నిత్యం ఒక్కరిపై ఒక్కరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ఈ ప్రత్యర్ధులు పక్కపక్క ఇళ్లవారే కావడం, మిత్రులు కావడం విశేషం. ఏమైనా ఈ లోకల్, నాన్ లోకల్.. వివాదం జోరందుకుంది.
ఖమ్మం పార్లమెంట్ స్ధానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రామసహాయం రఘు రామరెడ్డి ఇళ్ళు ఖమ్మం నగరంలో పక్కపక్కనే ఉన్నాయి. నగరంలోని నెహ్రునగర్‌లో ప్రస్తుత ఎంపీ నామ నాగేశ్వరరావు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే రామసహాయం రఘురామ రెడ్డి ఇల్లు ఉంది. ఇది ఇప్పటిది కాదు. దశబ్ధాల క్రితమే నిర్మించుకున్నారు. నామ నాగేశ్వరరావు రాజకీయాల్లోకి రాక ముందు నుంచీ ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నా, రఘురామరెడ్డి కుటుంబం మాత్రం హైదరాబాద్‌లోని మాధాపుర్‌లో స్ధిరపడ్డారు. అనూహ్యంగా ఖమ్మం ఎంపీ స్ధానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీ ఫామ్‌తో ఖమ్మం నగరానికి వచ్చిన రఘురాం రెడ్డి ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండడం లేదు. వైరారోడ్డులోని కొత్తగా నిర్మించిన విల్లాలో ఉంటున్నారు. ఆ విల్లా కూడా రఘురామరెడ్డి ఎన్నికల రాజకీయాల్లో కి రాక ముందే కొనుగోలు చేశారు.
రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారంలోకి ఎక్కడకు వెళ్ళినా, తాను స్ధానికుడిని అని తనకు ఇప్పటికి నెహ్రు నగర్‌లో సొంత ఇల్లు ఉందని పదే పదే చెబుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు ఇంటికి, కాంగ్రెస్ అభ్యర్ధి రఘురామ రెడ్డి ఇంటికి మధ్య గోడే అడ్డం. వీరిద్దరు రాజకీయ ప్రత్యర్ధులే అయినా, రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిదీ వరంగల్ జిల్లా కావడం విశేషం. కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామానికి చెందిన రామ సహా యం సురేందర్ రెడ్డి మరిపెడబంగ్లాకు దత్తత నిమిత్తం వారి బాబాయి ఇంటికి వెళ్లి అక్కడే స్ధిరపడ్డారు. సురేందర్ రెడ్డి తన చిన్నమ్మ కోసం ఖమ్మం నగరంలోని నెహ్రు నగర్‌లో 40 ఏళ్ళ క్రితమే నామ ఇంటి పక్కనే సొంత ఇంటిని నిర్మించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొరివి మండలం బలపాల గ్రామానికి చెందిన నామ నాగేశ్వరరావు కుటుంబం కొన్ని దశబ్దాల క్రితమే ఖమ్మం జిల్లాలో స్ధిరపడ్డారు. కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్ధులు డోర్నకల్ నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్ డివిజన్‌కు చెందినవారే
రామసహాయం సురేందర్ రెడ్డి డోర్నకల్ సెగ్మెంట్ నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందిన సురేందర్ రెడ్డి చందులాల్ చేతిలో ఓటమి తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఆ సమయంలోనే నామ నాగేశ్వరరావు రాజకీయ తెరపైకి వచ్చి, నాలుగు సార్లు ఖమ్మం ఎంపీగా పోటీ చేసి రెండు పర్యాయాలు గెలుపొందారు, ఇప్పడు ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం ఈ పార్టీలో అంతర్యుద్ధం లో మధ్యే మార్గంగా రామసహాయం రఘురాంరెడ్డి పేరు రాజకీయ తెరపైకి వచ్చి సిట్టింగ్ ఎంపి నామకు రాజకీయ ప్రత్యర్ధి అయ్యారు.
ఎన్నికల ప్రచారంలో ఎవ్వరికి వారే మిమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నేను పక్క లోకల్ అని నామ అంటుంటే , కాదు నేను పక్క లోక్‌ల్ అని రఘురాంరెడ్డి దీటుగా సమాధానం చెబుతున్నారు. కూసుమంచి మండలం చెగొమ్మ గ్రామం తమ సొంత ఊరు అని నామాది వరంగల్ జిల్లా బలపాల అని,తానే పక్కా లోకల్ అని రఘురాంరెడ్డి తన ప్రచారంలో పలుచోట్ల ప్రస్తావించారు. సూట్‌కేసు సర్ధుకొని వచ్చే వారిని నమ్మవద్దని రఘురాంరెడ్డిని ఉద్దేశించి నామ పరోక్ష విమర్శలు చేస్తున్నారు. టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు తాను స్ధానికంగా నివాసం ఉండే వాడినని తనకే ఓట్లు వెయ్యాని నామ కోరుతున్నారు. రఘురాంరెడ్డి నెహ్రునగర్‌లోని ఇంటితో పాటు ఒక ప్లాటు, విల్లా రెండు సినిమా ధియేటర్లు కూడా ఖమ్మం నగరంలో ఉన్నాయని చెప్పుకొంటూ తాను స్ధానికుడిని అని నిరూపించుకోవాడానికి నాన తంటాలు పడుతున్నారు. నామకు, రఘురాంరెడ్డికి ఖమ్మం నగరంలో పక్క పక్కనే ఇళ్ళు ఉన్నా, ఇద్దరికి హైదరాబాద్‌లో కూడా ఇళ్ళు ఉన్నాయి. ఇద్దరి వృత్తి కూడా వ్యాపారమే. ఇరువురికి కన్‌స్ట్రక్షన్ రంగంలో ప్రావిణ్యం ఉంది. నామకు ఖమ్మం నగరంలో ఓటు హక్కు ఉండగా రఘురాంరెడ్డికి మాత్రం తాను పోటి చేసే సెగ్మెంట్ పరిధిలో లేదు. కాని మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉంది. అయినా, లోకల్ కాని ఇద్దరూ తామే లోకల్.. ప్రత్యర్థి నాన్ లోకల్ అని ప్రచారం చేయడం చిత్రం.


