ఎమ్మెల్యేగా గెలవాలని అత్త.. తన వ్యూహాలు రచిస్తోంది. ఆమెను ఓడించాలని అల్లుడు గట్టిగా ట్రై చేస్తున్నాడు. దీంతో పొలిటికల్ పోరు అక్కడ రసవత్తరంగా మారింది. మరి.. మే 13న జరగబోయే ఎన్నికల్లో పైచేయి ఎవరిది ? అత్త లక్ష్యం నెరవేరుతుందా ? లేదంటే అల్లుడి పంతం నెగ్గుతుందా ? నువ్వా-నేనా అన్నట్లుగా జరుగుతున్న ఆ టఫ్ ఫైట్ గురించి తెలుసుకోవాలంటే ఎమ్మిగనూరు వెళ్లాల్సిం దే.
చేనేతపురిలో ఎన్నికల పోరు అత్యంత ఆసక్తి రేపుతోంది. నిజమే.. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా హోరాహోరీగా సాగుతున్నాయి. అసలు.. ఇక్కడ ఎన్నికల సమరం అంటేనే బీవీ, ఎర్రకోట కుటుంబాల మధ్యే ఉంటుంది. దశాబ్దాల తరబడి ఇదే పరిస్థితి.
అత్యంత ప్రతిష్టాత్మంగా మారిన 2024 ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు అన్ని పార్టీలూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అయితే.. ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి. కానీ, పెద్ద వయసు కావడం, స్థానికంగా ఉన్న పరిస్థితులు, సామాజిక వర్గ సమీకరణాలు బేరీజు వేసుకొని ప్రస్తుత ఎన్నికల కోసం బీసీ వర్గానికి చెందిన మాచాని వెంకటేష్ కు టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. అయితే.. టికెట్ ఇచ్చిన కొద్ది రోజులకే ఆయన ప్రోగ్రెస్ బాగాలేదని చెబుతూ తప్పించారు. ఇదే స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకకు అవకాశం కల్పించారు. దీంతో…ఇప్పటివరకు ఉన్న ఎర్రకోట, బీవీ కుటుంబాల పోరు కాస్తా ఈసారి లేనట్లైంది.అటు.. టీడీపీ తరఫున మాచాని సోమనాథ్ కు ఎమ్మిగనూరు టికెట్ దక్కవచ్చని అంతా భావించారు. ఈయన స్వయంగా బుట్టా రేణుకకు అల్లుడు. దీంతో.. అత్తా, అల్లుడి మధ్యే ఎమ్మెల్యే పోరు తప్పదని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ సీటును మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. అదే సమయంలో మాచాని సోమనాథ్ కు పార్టీ పదవి కట్టబెట్టారు. జయనాగేశ్వర్ రెడ్డిని గెలిపించి తీసుకురావాలంటూ మాచానిని ఆదేశించారు టీడీపీ అధినేత చంద్రబాబు.
చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన మాచాని సోమనాథ్.. టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేనా, ఎక్కడికక్కడ వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా కేంపెయినింగ్ నిర్వహిస్తూ బుట్టా రేణుకను కంగారు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పరిస్థితి గ్రహించిన బుట్టా రేణుక సైతం వైసీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూ విపక్ష నేతల ప్రచారాన్ని, విమర్శలను సమర్థంగా తిప్పికొడుతున్నారు. దీంతో ఇరువర్గాల ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. మరి.. నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో.. అత్త బుట్టా రేణుక పైచేయి సాధిస్తారా లేదంటే, అల్లుడు మద్దతిస్తున్న జయనాగేశ్వర్ రెడ్డి విజయం సాధిస్తారా ? ఎమ్మిగనూరు గడ్డపై వైసీపీ, టీడీపీలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది అన్నది సర్వత్రా ఆసక్తిరేపుతోంది.


