పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఎలక్షన్ హీట్ కాకరేపుతోంది. ప్రధాన పార్టీల త్రిముఖ పోరుతో సమ్మర్‌ను మించి సెగలు కక్కుతోంది. మరి నువ్వా నేనా అన్న రేంజ్‌లో సాగుతున్న లోక్‌సభ రణరంగంలో నెగ్గేదెవరు? తగ్గేదెవరు?
బొగ్గుగనులతో గోదావరినదికి ఇరువైపులా విస్తరించి ఉన్న పెద్దపల్లిలో పార్లమెంట్ పోరు ఆసక్తిగా మారింది. ఇక్కడ కార్మికుల ఓట్లే కీలకం. రేసు గుర్రాల తలరాతలు మార్చేది వీళ్లే. పెద్దపల్లి జిల్లాలో రామగుండం, మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలో ఉన్న మొత్తం కార్మికుల సంఖ్య 27 వేల 784. వీరు కాకుండా కాంట్రాక్టు కార్మికులు సుమారు 25వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరే కాకుండా కుటుంబసభ్యులన కలుపుకుంటే.. ఒక్కో ఇంట్లో సగటున నాలుగు ఓట్లైనా ఉంటాయని అంచనా వేస్తున్నాయి పార్టీలు. ఈ లెక్కన సుమారు రెండు లక్షలకుపైగా ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇక వీరితోపాటు రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబీకుల ఓట్లు మరో 50 వేల వరకు ఉంటాయని అంచనా. దీంతో కార్మికులను తమవైపుకి తిప్పుకుంటే ఈజీగా రెండున్నర లక్షల ఓట్లు తమ ఖాతాలో పడ్డట్టే అన్న వ్యూహంలో ఉన్నారు పార్టీ నేతలు.
1862 ఎన్నికల నుంచి ఇక్కడ స్థానికేతరుల హవానే కొనసాగుతోంది. అత్యధికంగా కాంగ్రెస్ 9 సార్లు విజయం సాధించగా.. టీడీపీ మూడుసార్లు, బీఆర్ఎస్ రెండుసార్లు గెలుపొందాయి. ఇక ఈసారి ఎలాగైనా తామే పాగా వేయాలన్న వ్యూహంలో ఉన్నాయి ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు. దీంతో త్రిముఖ పోరు నెలకొంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ సీటును కాపాడుకునే ఎత్తుగడలో ఉంది గులాబీ పార్టీ. ఆ దిశగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014, 2018 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచి తన సత్తా చాటింది. అయితే ఈసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలన్న కసిలో ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బరిలో దించింది. అయితే,.. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతకాని కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్‌ఎస్‌కు కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కార్మిక నేతగా, సౌమ్యుడిగా పేరున్న కొప్పులకు ప్రత్యర్థులతో పోలిస్తే.. స్థానికంగా పట్టు ఉన్న రాజకీయ అనుభవం తనకు కలసి వస్తుందనే ఆశలో ఉంది హైకమాండ్.
మరోవైపు ఈసారి ఎలాగైనా బోణి కొట్టాలని తహతహలాడుతోంది బీజేపీ. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాసే శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చి పోటీకి దించింది. గత ఎన్నికల నుంచే కమలం పార్టీ ఇక్కడ నుంచి బరిలో నిలుపుతోంది. సంస్థాగతం బలోపేతం కాకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల మినహా ఎక్కడా ఆశించిన ఓట్లు రాకపోవడం అలాగే పార్టీలో వర్గపోరులాంటి లెక్కలతో విజయం అంత సులువేం కాదన్న టాక్ వినిపి స్తోంది. అయితే ప్రధాని మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలను నమ్ముకున్నారు కమలనాథులు. ఆ దిశగానే విస్త్రృత ప్రచారం చేస్తున్న నాయకులు ఈసారి గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. దీనికి తోడు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకాని తమ కండువా కప్పుకోవడం కలిసొస్తుందన్న ఆశాభావంలో ఉన్నారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను చిత్తుచేసి, అధికారం చేజిక్కించుకున్న హస్తం నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామికి అడ్డాగా ఉన్న ఈ సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇచ్చింది హైకమాండ్. అయితే,.. వంశీకి రాజకీయ అనుభవం తక్కువగా ఉండటంతో తాత వెంకట స్వామి, తండ్రి వివేక్ అండతో తమ కుటుంబ సీటును కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఒకే కుటుంబం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు కూడా టికెట్ ఇవ్వడంతో క్యాడర్‌లో కొంత ఆసంతృప్తి కనిపిస్తోంది. మరోవైపు మాలలకే ప్రాధాన్యం ఇవ్వడంపై మాదిగలు గుర్రుగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ ‘హస్తం హవా కొనసాగడం వంశీకి కలిసొచ్చే అవకాశముందనన్న ఆశాభావంలో ఉన్నారు. మొత్తానికి ఎవరికి వారు తమ విజయం పక్కా అన్న ధీమాలో ఉన్నాయి బీఆర్‌ఎస్, బీజేపీ, హస్తం పార్టీలు. మరి ఎవరి లెక్కలు ఫలిస్తాయి.? ఎవరి లెక్కలు తారుమారవుతాయి.? పెద్దపల్లి ఇలాఖాలో ఎగిరే జెండా ఎవరిదన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరి ఈ ఉత్కంఠకు తెర దించాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


