ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకవైపు అధికారపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంటే మరోవైపు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి.
కూటమిలో ఉన్న మూడూ చిన్నాచితకా పార్టీలు కావు. భారతీయ జనతా పార్టీ అయితే ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. విభజన తరువాత తొలిసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక మూడోది జనసేన. సినీ నటుడు, ప్రజాకర్షణ గల పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఉంది జనసేన పార్టీ. ఈసారి ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి, ఒంటరిపోరు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఎన్నికల సమరం చేస్తున్నాయి. ఒకవైపు గత నాలుగున్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.మరోవైపు జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు చేస్తూ జనంలోకి వెళుతున్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న గులకరాళ్ల రాజకీయమే ఇందుకు ఉదాహరణ.
విజయవాడలో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేస్తుండగా ఒక వ్యక్తి విసిరిన రాయి ఆయన నుదుటికి తగిలింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఎడమకంటికి గాయమైంది. కంటికి దెబ్బ తగిలినా, బస్సులోనే ప్రాథమిక చికిత్స చేయించుకుని రాత్రి పదిన్నరవరకు రోడ్ షో కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి. రాయి తగిలిన సంఘటన…ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపింది. సహజంగా జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగింది. దీంతో నివ్వెరపోయిన తెలుగుదేశం పార్టీ రాయి సంఘటనను జగన్‌కు నెగటివ్ కోణంలో చూపించాలని డిసైడ్ అయింది. ఇంకేముంది…చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రచారం చేసినా, జగన్మోహన్ రెడ్డే కావాలని తనపై రాయి వేయించుకున్నారని నిరాధార ఆరోపణలు చేయడం ప్రారంభిం చారు. ఒకటి రెండు చోట్ల కాదు ప్రచారంలో భాగంగా ఏ ఊరు వెళ్లినా చంద్రబాబుకు గులకరాయి సంఘటనే రాజకీయమైంది.
చంద్రబాబు తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు మండిపడుతున్నారు. ఒకవైపు రాయి తగలి ఎడమ కంటినుంచి రక్తం కారినా కూడా దానిని ఒక డ్రామాగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిప్పులు చెరిగారు. దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన స్థాయిని మరచి ఇలా ఎలా ప్రవర్తించ గలుగుతున్నారని నివ్వెరపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇదిలా ఉంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సంబం ధించి ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఒకటా రెండా బోలెడన్ని పథకాలకు రూపకల్పన చేసింది. పేదల సంక్షేమమే టార్గెట్ గా ముందుకు వెళుతోంది. ఖజానాకు ఖర్చయినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పేదవాళ్లకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ఆశయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టనన్ని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే, గత నాలుగున్నరేళ్లుగా అమలైన సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రభుత్వ పథకాలు అమలైతే, అవి లబ్దిదారులకు చేరడంలో విపరీతమైన జాప్యం జరిగేది. సంబంధిత పత్రాలు తీసుకుని ఎక్కడో దూరాన ఉన్న మండల కేంద్రానికి వెళ్లేవారు లబ్దిదారులు. అక్కడ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర గంటల తరబడి ఒక్కోసారి రోజుల తరబడి ఎదురుచూసేవారు. ఆ సమయానికి ఎమ్మార్వో కార్యాలయంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. దీంతో ఒకటికి పదిసార్లు బస్సు చార్జీల ఖర్చు పెట్టుకుని ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగేవారు లబ్దిదారులు. దీంతో పల్లె జనం కష్టాల పాలయ్యేవారు. పల్లెజనం కష్టాలు తీర్చడానికి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే విలేజ్ వాలంటీర్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం మౌలికంగా వాలంటీర్ల పని. వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందేవారి కష్టాలు తీరాయి. ప్రభుత్వ సేవలు పల్లె ప్రజలకు చాలా సులభంగా అందుబాటులోకి వచ్చాయి.
ఒక్కో వాలంటీర్ యాభై కుటుంబాలను కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యాభై కుటుంబాలకు ప్రభుత్వపరంగా వివిధ పథకాల కింద వచ్చే సొమ్మును వాలంటీర్లు అందిస్తారు. ప్రతి వాలంటీర్‌కు గుర్తింపు కార్డు ఉంటుంది. ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు అనే నినాదానికి సజీవ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల వ్యవస్థే. పల్లెటూళ్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మహాత్ముడి మాటను వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలులో పెట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంతగా సేవలంది స్తున్న వాలంటీర్ వ్యవస్థను రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇటీవల వివాదాస్పదం చేశారు. వాలంటీర్ వ్యవస్థను పార్టీలకతీతంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి. దీంతో వాలంటీర్ వ్యవస్థను తప్పుపడుతూ తాను చేసిన వ్యాఖ్యలు బూమెరాంగ్ అవుతున్నా యని చంద్రబాబు గ్రహించారు. ఇంకేముంది వెంటనే ప్లేట్ ఫిరాయించారు. తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామంటూ డైలాగులు కొట్టారు. కాగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించింది. ఇవాళ్టి రోజున గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉన్నన్ని సదుపాయాలు, సౌకర్యాలు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లేవంటున్నారు పేరెంట్స్. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం వల్ల తమ పిల్లలు భవిష్యత్తులో యూపీఎస్‌సీ వంటి పోటీ పరీక్షలు రాయగలుగుతారని తల్లిదండ్రులు నమ్మకంతో ఉన్నారు. ఒకవైపు చేసిన మంచి పనులు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి సిద్దం అంటూ జనంలోకి దూసుకుపోతుంటే, గులక రాయి రాజకీయంతో కాలం వెళ్లదీస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.


